06-01-2026 03:22:11 PM
చెన్నై: కరూర్ తొక్కిసలాట కేసులో సినీనటుడు, రాజకీయ నాయకుడు, టీవీకే(Tamilaga Vettri Kazhagam) వ్యవస్థాపకుడు విజయ్‌కు సీబీఐ(Central Bureau of Investigation) సమన్లు జారీ చేసింది. ఈనెల 12న విచారణకు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులో విజయ్ కు సూచించింది. సెప్టెంబర్ 27, 2025న కరూర్ జిల్లాలోని వెలుస్వామిపురంలో జరిగిన టీవీకే రాజకీయ ర్యాలీలో భారీగా జనం ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. విజయ్ ప్రసంగం కోసం మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడినప్పుడు జరిగిన ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, డజన్ల కొద్దీ ఇతర వ్యక్తులు గాయపడ్డారు.
ఈ దుర్ఘటనపై దర్యాప్తులో భాగంగా దర్యాప్తు సంస్థ ఇంతకు ముందు టీవీకేకు చెందిన ఉన్నత స్థాయి కార్యకర్తలను ప్రశ్నించి, వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న తర్వాత ఇవాళ విజయ్ కు నోటీసులు జారీ చేసింది. ప్రారంభంలో, తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ విచారణను వ్యతిరేకించి, దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి, ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి సిట్ సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిసింది. అయితే, కరూర్ తొక్కిసలాట ఘటన జాతీయ మనస్సాక్షిని కదిలించిందని, స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ అవసరమని పేర్కొంటూ సుప్రీంకోర్టు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది. సిట్ తోనే విచారణను కొనసాగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించి, దర్యాప్తును కేంద్ర సంస్థకు అప్పగించడానికి అనుమతించింది.