calender_icon.png 29 October, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోళ్లపై సీసీఐ పేచీ

29-10-2025 12:21:44 AM

తేమ 12 శాతం దాటొద్దనే సాకుతో కొర్రీ!

మద్దతు ధర పొందేందుకు కష్టాలు

  1. దిగుబడులు తక్కువ.. ఆంక్షలు ఎక్కువ
  2. ప్రైవేటులో లభించని గిట్టుబాటు ధర
  3. అర్థంకాని ‘కపాస్ కిసాన్ స్కీం’ నిబంధనలు
  4. ఆందోళన చెందుతున్న రైతాంగం

ఆదిలాబాద్/నిర్మల్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పత్తి చేలు తడిసి సగం నష్టపోయిన రైతులను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెచ్చిన కపాస్ కిసాన్ స్కీం నిబంధనలు మరింత నష్టం చేకూర్చేలా ఉన్నాయి. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పంట దిగుబడి రాకపోగా, పండిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే.. 12 శాతం తేమ దాటితే కొనుగోలు చేయబోమని సీసీఐ అధికారులు చెపుతున్నారు.

దీంతో ప్రభుత్వం ఇస్తున్న క్వింటాలుకు రూ.8,010 మద్దతు ధర రైతులకు దక్కే అవకాశం లేకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. అటు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిద్దామంటే ధర చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో చాలామంది రైతులు ప్రైవేటుకు అమ్ముకోలేక పత్తిని తిరిగి ఇంటికి తీసుకెళ్లగా సీసీఐ మార్కెట్లలోనే ఆరబెట్టుకుంటున్నారు. 

‘కపాస్ కిసాన్’ కఠిన నిబంధనలు!

ప్రభుత్వ సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించుకునే రైతులకు కొత్త నిబంధనలను అమలు చేయడం రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నది. పత్తి సాగు చేసిన రైతులు వ్యవసాయ శాఖ క్లస్టర్ల పరిధిలో ఆన్‌లైన్‌లో కపాస్ కిషన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులో పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పంట చేతికి వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ ఆధారంగానే అధికారులు నిర్ణయించిన తేదీల్లోనే పత్తి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి.

అయితే పత్తి పంట తేమశాతం 12 శాతానికి మించకూడదు. అప్పుడే ప్రభుత్వం మద్దతు ధర పొందే అవకాశం ఉంది. అయితే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో చాలామంది రైతులు నిరక్షరాస్యులే కావడంతో కేకేఎస్(కపాస్ కిసాన్ స్కీం)పై అవగాహన లేక నష్టపోతున్నారు. నిబంధనలను సడలించాలని రైతులు కోరుతున్నారు. గతంలో పంటలు సాగు చేస్తున్న రైతు వివరాలను ఏఈవోలు క్రాప్ సర్వే నిర్వహించి ఆన్‌లైన్‌లో నమోదు చేసేవారు. ఆధార్ కార్డుకు లింకు చేసి, పత్తి అమ్మేటప్పుడు ఆధార్ కార్డుతో వెళితే వివరాలు తెలిసేవి.

ఇప్పుడు వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడటంతో రైతుల సమయం వృథా కావడమే కాకుండా ఆన్‌లైన్‌లో తప్పులు ఉంటే పత్తి కొనుగోలు నిలుపుదల చేసే అవకాశం ఉండటంతో ఆందోళన చెందుతు న్నారు. ఇప్పటికీ ఈ జిల్లాల్లో కపాస్ కిసాన్ యాప్‌పై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన పెంచుతున్నా 30 శాతం కూడా యాప్‌ను రైతులు డౌన్‌లోడు చేసుకోలేదు. 

ప్రైవేటుకు అమ్మితే నష్టాలు

ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో చాలామంది రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి పత్తిని అమ్ముతున్నారు. అయితే ప్రైవేట్ వ్యాపారులు కూడా తేమ, నాణ్యత లోపం సాకుగా చూపి క్వింటాలుకు రూ.7,200 వరకు ధర చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాలుకు రూ.వెయ్యి వరకు నష్టపోవాల్సి వస్తుంది. 

రైతును కదిలిస్తే కన్నీళ్లే!

సోమవారం ఆదిలాబాద్ మార్కెట్‌కు తీసుకొచ్చిన వందలాది మంది రైతుల పత్తిలో తేమ శాతం 12 కంటే కొంత అధికంగా చూపించడంతో అధికారులు కొనుగోలుకు నిరాకరించారు. దీంతో మూడు రోజుల నుంచి తిండి తిప్పలు మాని, నిద్రలేక మార్కెట్ యార్డ్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. ఓ రైతుకు చెందిన ఆరబెట్టిన పత్తిలో మంగళవారం సీసీఐ అధికారులు తేమను పరిశీలించగా 13 శాతం చూపించింది. ఒక్క శాతం అధికంగా చూపించడంతో సదరు అధికారులు కొనుగోలు చేయడం లేదు.

ఇలా అనేక మంది రైతులకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అనేక మంది రైతులు మార్కెట్ యార్డులోనే క్వింటాళ్ల కొద్ది పత్తిని ఆరబెట్టుకుంటున్నారు. ప్రత్యేకంగా కూలీలను పెట్టి పత్తిని ఆరబెడుతున్నారు. వీరికి రోజు కూలీ ఇవ్వడంతో పాటు ట్రాక్టర్ కిరాయి కోసం రోజుకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజులు పాటు మార్కెట్లోనే ఉండటంతో తుఫాను కారణంగా బుధవారం మార్కెట్ కు ముందస్తుగానే సెలవు  ప్రకటించడంతో రైతులు మరో రెండు రోజుల పాటు మార్కెట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

అకాల వర్షాలతో తెగులు

అమ్మకానికి మార్కెట్‌కు తీసుకువచ్చిన పత్తిలో తేమ శాతం ఉందని మార్కె ట్లోనే ఆరబెట్టుకుంటే, ఇటీవల కురుస్తున్న వర్షాలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 79 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 1.40 లక్షల ఎకరాలు పత్తి పంట సాగు చేశారు. జిల్లాలో 11.20 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్న వ్యవసాయ అధికారులు పత్తి కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

జిల్లాలో 18 మండలాల పరిధిలో ఐదు చోట్ల సీసీఐ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యా ప్తంగా గత రెండు నెలల నుంచి వరుసగా వర్షాలు కురవడంతో తెగులు సోకి పత్తి ఎదగలేదు. దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. గతంలో పత్తి చెట్టుకు 70 నుంచి 80 కాయలు కాసేవి. ప్రస్తుతం 20 కా యలు కూడా కాయడం లేదు. దీంతో ఎకరానికి 8 క్వింటాళ్లు వరకు వచ్చే దిగుబడి ఈసారి నాలుగు క్వింటాళ్లకు పడిపోయిందని రైతులు చెపుతున్నారు.

అంతేకా కుండా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పత్తి ఏరడానికి కూలీల కొరత ఉండటంతో అధిక ఖర్చు చేసి మహారాష్ట్ర కూలీలను రప్పిస్తున్నారు. ఇది రైతులు మరింత భారం అవుతోంది. ప్రభుత్వం నిబంధనలను సడలించి నాణ్యతలేని పత్తిని కూడా ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తేనే రైతులకు ప్రజలు ఉంటుందని జిల్లా రైతులు కోరుతున్నారు.

తేమ నిబంధనతో చిక్కులు 

తేమ నిబంధనలు చిక్కులు తెచ్చి పెట్టింది. అమ్మకానికి తీసుకువచ్చిన పత్తిలో తేమ శాతం సాకుతో సీసీఐ కొనుగోలు చేయడం లేదు. తెచ్చిన పత్తిని గత రెండు రోజులుగా మార్కెట్ యార్డులోనే ఎండబెడుతున్నాం. 12 కంటే ఒక శాతం ఎక్కువ తేమ చూపించిన కొనుగోలు చేయకుంటే తమ పరిస్థితి ఏమిటి. ట్రాక్టర్ ఖర్చు, కూలీల ఖర్చు ముదపడుతున్నాయి. నిద్రా హారాలు మాని మార్కెట్ లోనే పడిగాపులు కాస్తున్నాం. 

రాజారెడ్డి, రైతు, నిపాని 

ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులు ఇంతే 

పంట సాగు సమయంలో అకాల వర్షాలు పంటను నీటముంచాయి. కాస్తో కూస్తో చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వస్తే తేమ శాతం నిబంధనలు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. గత రెండు రోజులుగా మార్కెట్ యార్డులోనే పత్తిని ఆరబెట్టుకుంటే ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తూ మరింత తేమ శాతం పెంచుతూ తమను నట్టేట ముంచుతున్నాయి. ఏ ప్రభుతం వచ్చినా మా బతుకులు ఇంతే. 

 రాములు, రైతు, కుచులపూర్

సీసీఐ కేంద్రంలోనే విక్రయించాలి

ప్రభుత్వం ఈసారి పత్తి కొనుగోలను పారదర్శకంగా నిర్వహించేం దుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పత్తి విక్రయాల్లో అక్రమాలకు తావు లేకుండా ప్రభు త్వం కపాస్ కిసాన్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. దీనిపై రైతులకు పూర్తిగా అవగాహన కల్పించాం. రైతు లు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి సీసీ ఐ కేంద్రంలోనే విక్రయించి, ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలి. 

 సోమ భీమ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, నిర్మల్