21-05-2025 01:11:02 AM
వాషింగ్టన్, మే 20: రష్యా, ఉక్రెయిన్ కాల్పుల విరమణ కోసం త్వరలోనే చర్చలు ప్రారంభిస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ రెండు గంటల పాటు ఫోన్‌లో మాట్లాడారు. రష్యాతో కాల్పుల విమరణ చర్చలను తాము త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రతీ వారం సగటున 5వేల మంది సైనికులు చనిపోతున్నారని, మేం దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో.. ‘మేము చేయగలిగినంత చేస్తున్నాం. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో రెండు గంటలు సంభాషించా.. వెంటనే కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ చర్చలు ప్రారంభిస్తాయి.
కొనసాగుతున్న ‘విపత్తు రక్తపాతం’ ముగిసిన తర్వాత రష్యా అమెరికాతో పెద్ద ఎత్తున వాణిజ్యంలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతుంది. రష్యా సామర్థ్యం అపరిమితం. ఉక్రెయిన్ కూడా దాని పునర్నిర్మాణ ప్రక్రియలో వాణిజ్యం ద్వారా ప్రయోజనం పొందుతుంది’ అని రాసుకొచ్చారు. పుతిన్‌తో సంభాషణ తర్వాత ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూరోపియ న్ నేతలతో సైతం మాట్లాడారు.
ట్రంప్‌తో సంభాషణ తర్వాత పుతిన్ మాట్లాడుతూ..శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్‌తో కలిసి పనిచేయడానికి మాస్కో సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ సంక్షోభానికి మూలకారణాలను తొలగించడమే తమకు ప్రధాన విషయమని అన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ..యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో భాగంగా కీవ్, రష్యా, యూరోపియన్ దేశాలు, అమెరికా, బ్రిటన్‌లతో కూడిన ఉన్నత స్థాయి సమావేశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశం త్వరలోనే జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.