calender_icon.png 27 August, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల ముందు సవాళ్లు

26-08-2025 12:00:00 AM

దేశవ్యాప్తంగా అన్ని రంగాలలోని కార్మికులు తమ జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నాలుగు కార్మిక చట్టాలు, వివిధ రాష్ర్ట ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలలో మార్పులు.. కార్మికులు యూనియన్లను నమోదు చేయడం కష్టతరంగా మార్చింది. ఎనిమిది గంటల పని దినం కోసం, జీవనోపాధి భద్రత కోసం, గౌరవప్రదమైన జీవన వేతనం కోసం, కాంట్రాక్ట్ కార్మికుల పెరుగుతున్న వినియోగానికి వ్యతిరేకంగా, సురక్షితమైన పని, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం పోరాడాల్సిన పరిస్థితి.

ఐటీ కార్మికులు, రవాణా, ఆరోగ్య రంగాల కార్మికులు, బ్యాంకింగ్ భీమా కార్మికులు, రైల్వే కార్మికులు, గని కార్మికులు, ఉపాధ్యాయులు ఇలా అనేక మంది ఇతర సంస్థల కార్మికులు తమ హక్కుల పరిరక్షణ గురించి ఆందోళన పడుతున్నారు. పదివేల మంది కార్మికులను తొలగిస్తున్న టీసీఎస్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజాలు లే ఆఫ్స్ పేరుతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఫలితంగా పెద్ద ఎత్తున ఉద్యోగ తొలగింపు వల్ల మిగిలిన కార్మికులపై పనిభారం పెరిగింది.

రైల్వేలు, రవాణా, విద్యుత్ సరఫరా, ఆరోగ్యం, విద్య వంటి ప్రజా సేవల ప్రైవేటీకరణ వల్ల ఈ సేవలను ప్రజలు భరించలేనంతగా మార్చింది. నాలుగు కార్మిక చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా, 40 లేదా అంతకంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలో పనిచేసే కార్మికులకు లేదా 50 లేదా అంతకంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కార్మిక కాంట్రాక్టర్‌కు ఎటువంటి హక్కులు లేవు. వారిని ప్రతిరోజూ ఎన్ని గంటలు అయినా పని చేయించవచ్చు. ఎప్పుడైనా కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించవచ్చు.అనేక రాష్ర్ట ప్రభుత్వాలు ఇప్పటికే తమ కార్మిక చట్టాలలో మార్పులను అమలు చేయడం ప్రారంభించాయి.

రోజుకు 12- నుంచి 15 గంటల పని, సిక్ లీవ్ ,ప్రసూతి సెల వుల తిరస్కరణ, మహిళా కార్మికులకు తక్కువ వేతనాలు, మహిళలకు రాత్రిపూట పని, నచ్చిన యూనియన్లను నిర్వహించే హక్కు, సమ్మె చేసే హక్కులను తిరస్కరించడం జరుగుతుంది. మహిళా బీడీ కార్మికులు, నేత కార్మికులు, చెత్త వేరు చేసేవారి ఆదాయం తగ్గడం చూస్తే దిగజారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోంది.

కాంట్రాక్ట్ నర్సులకు ఉద్యోగ భద్రత లేకపోవడం, రెగ్యులర్ నర్సుల కంటే తక్కువ జీతం చెల్లించడం వల్ల ఎక్కువ గంటలు పనిచేసినా వారి దుస్థితి దారుణంగా ఉంది. ప్రసూతి సెలవులు, అనారోగ్య సెలవులు వంటి ప్రాథమిక హక్కులు కూడా వారికి నిరాకరించబడుతున్నాయి. ఈ విభిన్న వర్గాల కార్మికులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ఒక్కటే పరిష్కార మార్గం.

వేణుమాధవ్, హైదరాబాద్