calender_icon.png 27 August, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలవంచని భారత్

26-08-2025 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇగో కొద్దీ వేసిన అదనపు 25శాతం సుంకాలు ఈ నెల 27 నుంచి భారత్ భరించాల్సి వుంది. భారత్ ఎగుమతులపై ట్రంప్ ఇదివరకే ప్రకటించిన 25శాతం ప్రతీకార సుంకం ఈ నెల 7 నుంచే అమలులోకి వచ్చింది. రష్యా నుంచి ముడిచమురు డిస్కౌంట్‌కు కొనుగోలు చేస్తున్న భారత్, రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. వాణిజ్య విపణిలో ఏ దేశం నుంచి ఏ వస్తువులు దిగుమతి చేసుకోవాలనేది ఆయా దేశాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంటుందే గాని, ఈ విషయంలో ఎవరూ ఒత్తిడి చేయాల్సిన  పని లేదని భారత్ స్పష్టం చేసింది.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు, రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లను ఆపాలని ట్రంప్ లంకె పెట్టారు. చమురు దిగుమతి చేసుకుని భారత్ ఇచ్చే డబ్బులతోనే రష్యా, ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్నట్లుగా ట్రంప్ వాదనలు ఉన్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి జరిగిన సంప్రదింపుల్లోనూ అమెరికా పెత్తందారీ పోకడల్ని అవలంబించింది. భారత్ వ్యవసాయం రంగం కునారిల్లేలా, తమ ఉత్పత్తులను భారత్ మార్కెట్‌కు ఇబ్బడి ముబ్బడిగా ఎగుమతి చేసేందుకు అమెరికా వేసిన పాచికలేవీ పారలేదు.

వాణిజ్యం ఒప్పందం మాటున దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టే ప్రసక్తే లేదని భారత విదేశాంగ మంత్రి జయ్‌శంకర్, వాణిజ్య మంత్రి పియూశ్ గోయల్ స్పష్టం చేశారు. వాణిజ్య ఒప్పందంపై భారత్ వైఖరి అమెరికాకు మింగుడు పడటం లేదు. రష్యా నుంచి తక్కువ ధరకు ముడిచమురు కొంటున్న భారత్, దానిని శుద్ధి చేసి విక్రయించి లాభాలు గడిస్తున్నదని ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. ఇది మరీ విచిత్రం. భారత్ నుంచి చమురు గాని, శుద్ధి చేసిన ఉత్పత్తులను గాని కొనకూడదనుకుంటే కొనకండి.. ఎవరూ ఎవర్ని బలవంతపెట్టేదేమీ లేదని జయ్‌శంకర్ చేసిన ప్రకటనతో అమెరికా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.

ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలం నుంచి ప్రపంచ మార్కెట్లు ఛిన్నాభిన్నమయ్యాయి. అమెరికాకు అర్థికంగా మరింత బలోపేతం చేస్తామని చెప్పుకొన్న ట్రంప్, వాణిజ్య ఒప్పందాలు, సుంకాల గట్టి వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న భారత్ ఇప్పుడు పునరాలోచన చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ షరతులను బేఖాతరు చేస్తూ, రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని కొనసాగించేందుకు నిర్ణయించుకున్న భారత్, అటు చైనాతో కూడా వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకొంటున్నది.

హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నూర్ జిల్లాలో భారత్, చైనా సరిహద్దులో ఎప్పటినుంచి వాణిజ్యానికి ఉన్న షిప్ కిలా పాస్‌ను తిరిగి తెరిచేందుకే చైనా సూత్రప్రాయంగా అంగీకరించింది. ఐదేళ్ల క్రితం కొవిడ్ సమయంలో ఈ మార్గం మూతపడింది.భారత్‌కు ఎరువులు సరఫరా చేయడంలో వున్న నిబంధనల్ని  సడలించడానికి కూడా ఇటీవల చైనా అంగీకరించింది. ఎరువుల ఎగుమతికే కాదు, పారిశ్రామిక ఉత్పత్తులను కూడా అందించేందుకు చైనా ముందుకు వచ్చింది. ఎరువులు ముఖ్యంగా యూరియా కొరతను అధిగమించేందుకు చైనా నుంచి 7 మిలియన్ టన్నుల యూరియాను భారత్ దిగుమతి చేసుకునేందుకు మార్గం సుగమమైంది.