26-09-2025 12:00:00 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ వరుసగా భారత్‌కు షాక్‌లు ఇస్తూ నిర్ణయాలు తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిన అమెరికా తాజాగా భారత ఉద్యోగులను టార్గెట్ చేస్తూ హెచ్ 1 వీసా ఫీజులను లక్ష డాలర్లకు పెంచు తూ తీసుకున్న నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులను కష్టాల్లో పడేలా చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ‘స్వదేశీ’ని మరో సారి పునరుజ్జీవింప చేశారు. తన ప్రసంగంలో విదేశం కంటే స్వదేశీనే ప్రోత్సహిం చాలని పదే పదే పేర్కొన్న మోదీ తదనంతరం ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘స్వదేశీ 2.0’ అని పిలుపునిచ్చారు.
విదేశీ వస్తువులపై ఆధారపడటమే మనకు పెద్ద శత్రువు అని పేర్కొన్నారు. ఇక దసరా సందర్భంగా నవరాత్రుల్లో మొదటి రోజు నుంచే ‘బచత్ ఉత్సవ్’ (సేవింగ్స్ ఫెస్టివల్) ప్రారంభిస్తామని ప్రకటించారు. దీనిని జీఎస్టీ 2.0 సంస్కరణలతో కలిపి, విదేశీ వస్తువులను తిరస్కరించి స్వదేశీ ఉత్పత్తులు వాడమని సూచించారు. కానీ మోదీ ఇచ్చిన పిలుపు నిజంగా ప్రజల కోసమా లేకుంటే తన అవసరాల కోసమా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఎం దుకంటే ఇక్కడ మోదీ నిత్యం ధరించే దుస్తుల దగ్గర నుంచి తినే ఆహారం వరకు అన్నీ విదేశాల నుంచి ఉత్పత్తి అవుతున్నవే కావడం గమనార్హం. ఆయన ధరించే సూ ట్స్, షూస్, ఫర్ఫ్యూమ్ స్ప్రేల నుంచి తాగే పానీయాలు, వాడే వాహనాల దాకా అన్నీ విదేశాల నుంచి వచ్చినవే. దీంతో మోదీ మాట్లాడిన మాటలపై ఆలోచించాల్సిన అవసరముంది.
మధ్యతరగతికి మేలేనా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల పేరుతో అక్కడ పనిచేస్తున్న భారతీయులను ఉద్యోగాల నుంచి తొలగించి ఇక్కడికి పంపుతున్నారన్న కోపం మోదీకి ‘స్వదేశీ’ మంత్రం జ్ఞాపకం వచ్చేలా చేసిందా?అన్న అనుమానం రాక మానదు. ఎందుకంటే పేదలు, సాధారణ, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎలాగూ... అత్యంత ఖరీదైన విలాసవంతమైన వస్తువులు కొనలేరు. విమా నాలు ఎక్కలేరు. వ్యాపార ప్రకటన వల్ల ఎంత గాఢమైన కోరికలు వారికి కలిగినా బలవంతంగా ఆ కోర్కెలు దిగమింగుకోవడమే తప్ప మధ్య, దిగువ తరగతికి చేయ డానికి ఏం లేదు. ఇప్పటికీ మన దేశంలో నూటికి 90 శాతం ప్రజలు.. ఉప్పు, పప్పు, వంట నూనె, కూరగాయలు, గ్యాస్, మం దులు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం మొదలైనవి అందుబాటు ధరల్లో దొరికితే చాలు అనుకునే పేద, మధ్యతరగతి వాళ్లే ఎక్కువగా ఉన్నారు.
2017లో తమ ఆర్థిక అవసరాల కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో గత 8 ఏళ్ళుగా సామాన్య ప్రజలు నలిగిపోయిన మాట వాస్తవం. ప్రజల రక్త, మాంసాలను వివిధ ట్యాక్స్‌ల రూపంలో పిండి.. అదానీ, అంబానీ లాం టి కార్పొరేట్ కంపెనీల ఓనర్లకే సకలం సమకూర్చారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. జీఎస్టీతో రాష్ట్రాల ఆదాయాన్ని నిలువు దోపిడి చేయడమే గాక, గవర్నర్ల పాలనలతో రాష్ర్ట ప్రభుత్వాలను భ్రష్టు పట్టించారు. అయితే ట్రంప్ హెచ్చరికలతో ఇంతకాలానికి స్వదేశీ వస్తువులను మాత్ర మే వాడాలి అనే భావన ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కలగడం గొప్ప విషయమనే చెప్పొచ్చు. ఒక రకంగా మనం ట్రంప్‌కు కృతజ్ఞతలు చెప్పాలి.
పిలుపు సరైనదే
ట్రంప్ హెచ్చరికలతోనైనా మోదీ ఇంతకాలానికి ‘స్వదేశీ’ పిలుపు ఇవ్వడం వ్యూ హాత్మకంగా సరైనదే అని చెప్పొచ్చు. ట్రం ప్ టారిఫ్‌లతో భారత్ ఎగుమతులు (ముఖ్యంగా ఐటీ, ఫార్మా) ఎగుమతులు 20- నుంచి 30 శాతం తగ్గిపోవచ్చు. హె-1 వీసా ఫీజు ఐటీ సంస్థల మార్జిన్‌లు దెబ్బతీసే అవకాశముంది. అయితే స్వదేశీ ప్రచా రం ద్వారా భారతీయ కంపెనీలు (జోహో, పేటీఎం) పెరిగి ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఉదాహరణకు గాంధీజీ ‘స్వదేశీ’ విధానంలో తాను స్వయంగా నూలు వడికారు. నేత ఖద్దరు దుస్తులు జీవితాంతం తయారు చేసుకుని ధరించారు. ఆయన ప్రజలకు చెప్పడానికి ముందు తాను స్వ యంగా ఆచరించి ఆ తర్వాతనే ఇతరులకు బోధించేవారు.
అందుకే ఆయన మాటలకు, చేతలకు మధ్య వైరుధ్యాలు ఉండేవి కావు. ఇది నిజమైన ప్రేరణ. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం విదేశీ లగ్జరీ బ్రాండ్స్‌పై ట్యాక్స్‌ను పెంచి స్వదేశీ పరిశ్రమలకు సబ్సిడీలు ఇవ్వడం మంచిది. లేదంటే ఇది కేవలం ఒక రాజకీయ నినాదంగా మిగిలి పోతుంది. ప్రజలకు విదేశీ వస్తువులు మన దేశీయ మార్కెట్లలో అందుబాటులో లే కుండా ప్రభుత్వం చేయగలిగితే బాగుంటుంది. అప్పుడే విదేశీ వస్తువులపై వ్యా మోహం పోయి స్వదేశీ వస్తువులు కొనేందుకు అలవాటు పడే అవకాశం ఉంటుం ది.
స్వదేశీ బాటలో నైపుణ్యాభివృద్ధికి దోహదపడితే రానున్న సవాళ్లు దూరమవ్వడం ఖాయం. దేశంలోని మీడియా, ఇంటర్నెట్ ద్వారా విదేశీ వస్తువుల వ్యాపా రం జరగకుండా చూడాలి. వ్యాపార ప్రకటనలు నిలుపుదల చేయాలి. తాజాగా మోదీ కూడా తన పిలుపును మాటలకే పరిమితం చేయకుండా గాంధీ లాగా ఆయన స్వదేశీ వస్తువులు వాడుతూ, విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ అందరికీ ప్రేరణగా నిలవాల్సిన అవసరముంది. దేశ ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చే ఇలాంటి పని మోదీ చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.
మీడియా స్పందన?
అయితే మోదీ స్వదేశీ పిలుపుకు సంబంధించి భారతదేశంలో మీడియా స్పందన మిశ్రమంగానే ఉంది. మోదీ పిలుపును న్యూస్ 18కు చెందిన అభిజిత్ మజుందర్ ‘వ్యూహాత్మక ప్రతిస్పందన’గా పేర్కొన్నారు. ట్రంప్ టారిఫ్‌లకు భారత్ స్వ దేశీతో సమాధానం ఇస్తోందని, ఇది ఆర్థిక స్వాతంత్య్రానికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక హిందుస్తాన్ టైమ్స్ జీఎస్టీ సంస్కరణలను స్వదేశీతో జోడించి ‘బచత్ ఉత్సవ్’ పేరుతో సానుకూలంగా పేర్కొంది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ జోహోకు మారి ‘అందరూ స్వదేశీలో చేరండి’ అని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. అయితే ప్రశంసలు ఎంతలా వస్తున్నాయో విమర్శలు కూడా అంతే స్థాయిలో వచ్చా యి.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మోదీ స్వదేశీ పిలుపుపై స్పందిస్తూ.. ‘మీరు విదేశీ జెట్‌లో తిరుగుతూ స్వదేశీ మాటలు మా ట్లాడతారా?’ అని ప్రశ్నించారు. స్వదేశీ పిలుపునిచ్చిన మోదీ తాను వాడుతున్న వస్తువుల్లో ఒకటి ఇటలీ.. మరొకటి స్విట్జర్లాండ్.. ఇంకొకటి అమెరికాలో తయార య్యాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బాహటంగా విమర్శించడం ‘టైమ్స్’ , ‘ఎకనామిక్ టైమ్స్’ తమ కథనంలో హైలైట్ చేశాయి. ‘ది హిందూ’ పత్రిక.. ట్రంప్.. మోదీకి మంచి మిత్రుడు కావడంతోనే ఆయనపై ప్రత్యక్ష దాడికి దిగకుండా స్వదేశీ పిలుపుతో పరోక్షంగా మాటలు మాట్లాడ డం చూస్తే ఆయన నుంచి బలమైన ప్రతిస్పందన కరువైందని తప్పుబట్టడం గమ నార్హం.
ఈ విషయంలో విదేశీ మీడియా లో స్పందన తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో స్వదేశీని ‘ఉద్రిక్తతల మధ్య ప్రతిస్పందన’గా చూపిస్తూ రాయిటర్స్ తన సామాజిక మాధ్యమం ‘ఇన్‌స్టా గ్రామ్‌లో’ ఒక రీల్‌గా చూపించింది. వాణిజ్య ఉద్రిక్తతలపై దృష్టి పెట్టిన బంగ్లాదేశ్‌కు చెందిన టీసీఎస్ న్యూస్ హైపో క్రసీని మాత్రం ప్రస్తావించలేదు. యాహూ న్యూస్, డొనాల్డ్ ట్రంప్ హె 1బీ వీసా ఫీజు పెంపును కవర్ చేస్తూ స్వదేశీ ప్రచారాన్ని తాకింది. అయితే, విదేశీ మీడియా హైపోక్రిసీ కంటే వాణిజ్య ఉద్రిక్తతలపై ఎక్కువ దృష్టి పెట్టింది. మొత్తంగా మోదీ స్వదేశీ పిలుపు భారత్ ఆర్థిక స్వాతంత్య్రానికి అవకాశం ఇస్తుంది. కానీ నాయకులు మాటల తో కాకుండా చర్యలతో మారాలి. ప్రజలు స్వదేశీని స్వచ్ఛందంగా అనుసరిస్తే ట్రంప్ టారిఫ్‌లు భయపెట్టేందుకు ఆస్కారం లేదు. అలా జరగకపోతే ఇది కేవలం రాజకీయ నాటకంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వ్యాసకర్త సెల్: 9849328496