calender_icon.png 22 November, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం

26-07-2024 12:53:20 AM

  1. తెలంగాణకు రికార్డు స్థాయిలో రైల్వే బడ్జెట్ 
  2. ఏబీఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 40 స్టేషన్ల ఆధునికీకరణ 
  3. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): తెలంగాణకు కేంద్ర రైల్వే బడ్జెట్ కేటాయింపులు రికార్డుస్థాయిలో ఉన్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్ ఎంతో అభివృద్ధి చెందుతోందని వివరించారు. బడ్జెట్ కేటాయింపులు మొదలుకొని, నూతన రైల్వేట్రాక్‌ల నిర్మాణం, విద్యుద్దీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, నూతన రైల్వేస్టేషన్ల ఏర్పాటు, సిద్దిపేటమెదక్ నూతన రైల్వే లైన్ ప్రారంభం, చర్లపల్లి నూతన టెర్మినల్  ఏర్పాటు వంటి ఎన్నో అంశాల్లో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.5,336 కోట్ల నిధులు కేటాయించడం పట్ల కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం నాటి బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే దాదాపు 21 రెట్లు ఎక్కువ అని తెలిపారు. 2009 మధ్యన ఉమ్మడి ఏపీ రాష్ర్ట సగటు కేటాయింపులతో పోలిస్తే 6 రెట్ల కంటే ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రూ.32,946 కోట్లతో నూతన రైల్వేట్రాక్‌ల నిర్మాణం జరుగుతుందన్నారు. 2009 మధ్యన సంవత్సరానికి సగటున 17 కి. మీ.ల నూతన రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరగగా, గత పదేళ్ల కాలంలో సంవత్సరానికి సగటున 65 కి.మీ. నూతన రైల్వేట్రాక్‌ల నిర్మాణం జరిగిందన్నారు. 

100 శాతం విద్యుద్దీకరణ పూర్తి

నూతన రైల్వేట్రాక్‌లను నిర్మించడమే కాకుండా నిర్మించిన రైల్వేట్రాక్‌ల విద్యుద్దీకరణపై కూడా రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధను కనబరచిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఫలితంగా రాష్ర్టంలో 100 శాతం రైల్వేల విద్యుద్దీకరణ సాధ్యమైందన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా 437 రైల్ ఓవర్ బ్రిడ్జీలు, రైల్ అండర్ బ్రిడ్జీల నిర్మాణం జరిగిందని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్) ద్వారా రాష్ర్ట వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించే పనులు జరుగుతున్నాయని వివరించారు.

వీటితోపాటుగా హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడానికి చర్లపల్లిలో నిర్మిస్తున్న నూతన టెర్మినల్ పనులు 99శాతం పూర్తి అయ్యాయని త్వరలోనే ప్రారంభోత్సవం ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయన్నారు. త్వరలో వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు.