calender_icon.png 22 November, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీకర్ నిర్ణయం తర్వాతే న్యాయ సమీక్ష

26-07-2024 12:56:13 AM

  1. ఫిరాయింపుల కేసులో కోర్టుల జోక్యం పరిమితం 
  2. స్పీకర్ వద్ద పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జోక్యానికి వీల్లేదు 
  3. పార్టీ పిరాయింపుల కేసులో ప్రభుత్వం, ఎమ్మెల్యేల వాదన

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): అసెంబ్లీ స్పీకర్ వద్ద ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఆ వ్యవహారంపై కోర్టులు న్యాయ సమీక్ష చేయలేవని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అనర్హతపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత సంతృప్తి చెందనివాళ్లు కోర్టులను ఆశ్రయించేందుకు వీలుంటుందని, స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకొనేలా ఆదేశించాలని పిటిషన్లు వేస్తే వాటిపై కోర్టులు ఉత్తర్వుల జారీ చేసేందుకు రాజ్యాంగం ప్రకారం వీల్లేదని పేర్కొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద, దానంపై బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి వేసిన రిట్లను న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారించారు.

రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది పీ శ్రీరఘురాం, కడియం శ్రీహరి తరఫున సీనియర్ న్యాయవాది బీ మయూరెడ్డిడ్డి వాదించారు. మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌లో స్పీకర్ కార్యాలయం తన ఫిర్యాదును రిజిస్టర్ పోస్టులో పంపితే వెనక్కి వచ్చేసిందని, పిటిషన్ స్వీకరించేలా స్పీకర్‌కు ఉత్తర్వులు ఇవ్వాలనేది పరిమితమైన వ్యవహారమని ఏజీ చెప్పారు. మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను స్వీకరించేందుకు స్పీకర్ కార్యాలయం సిద్ధమేనని తెలిపారు. మిగిలిన పిటిషన్లను ఆదిలోనే కొట్టేయాలని ఏజీతోపాటు మిగిలిన ఇద్దరు న్యాయవాదులు కోరారు.

పార్టీ ఫిరాయింపులు, అనర్హత అంశాలపై శాసనసభ నిర్ణ యం తీసుకోదని, పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో నిర్ణయం తీసుకుంటారని వివరించారు. రాజ్యాంగం ప్రకారం అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్‌కు కోర్టులు ఉత్తర్వులు జారీ చేసేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తుచేశారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా స్వతంత్ర హోదాలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక, ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసేందుకు రాజ్యాంగం వెసులుబాటు కల్పించిందని పేర్కొన్నారు.

తాజా కేసులో పిటిషనర్లు స్పీకర్‌కు పిటిషన్లు ఇచ్చిన పది రోజులకే కోర్టుకు వచ్చారని ఆక్షేపించారు. స్పీకర్ తన వద్ద ఉన్న వివాదంపై నిర్ణయం తీసుకునే వరకు ఈ వ్యవహారంపై న్యాయ సమీక్షకు వీల్లేదని తెలిపారు. వాదనల అనంతరం హైకోర్టు మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను స్పీకర్ కార్యాలయం స్వీకరించి ఆ మేరకు రశీదు కూడా ఇవ్వాలని స్పీకర్ సెక్రటరీకి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని పిటిషన్లపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

మొక్కల పెంపక చర్యలు చెప్పండి:హైకోర్టు

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా మొక్కల పెంపకానికి ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొక్కల పెంపకం మన కోసం కాదని, భవిష్యత్తరాల కోసమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నది. ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీలు వ్యతిరేక వ్యాజ్యాలుగా పరిగణించకుండా, అందులో సానుకూలంగా వ్యవహరించాలని చెప్పింది. మొక్కల పెంపకానికి చేపట్టిన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది.