02-11-2025 01:23:26 AM
ప్రజా ప్రాధాన్యంశంగా రోడ్డు భద్రత: డీజీపీ శివధర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి) : రాష్ర్టంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలను తీవ్రంగా పరిగణిస్తూ, వాటి నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ అరైవ్ అలైవ్ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు డిసెంబర్‌లో 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టనున్నట్లు డీజీపీ బి. శివధర్ రెడ్డి ప్రకటించారు.
శనివారం డీజీపీ కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోడ్డు భద్ర తా నిపుణులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ప్రతి సంవత్సరం రాష్ర్టంలో జరుగు తున్న హత్యల కన్నా, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పది రెట్లు ఎక్కువగా ఉంది. ఇది అత్యంత ఆందోళన కలిగిం చే విషయం. అందుకే రోడ్డు భద్రతను ప్రజా ప్రాధాన్య అంశంగా తీసుకోవాలని అన్నారు.
ఈ నెల 16న జరిగే ‘ప్రపంచ రోడ్డు భద్రతా బాధితుల స్మారక దినం సందర్భంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అల వాట్లను, ముఖ్యంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య లక్ష్యమ ని స్పష్టం చేశారు. స్వచ్ఛంద సంస్థల సూచనలను అభినందించిన డీజీపీ, ఈ కార్యక్ర మాన్ని పోలీస్, రవాణా, కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలు, ఎన్జీవోలు సమన్వయంతో ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ప్రజల భాగస్వామ్యం, అవగాహన, నిబంధనల కఠిన అమలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే నాలుగు అంశాల సమన్వయంతోనే ప్రమాదాలను అరికట్టగలమని డీజీపీ స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, రమేశ్ నాయుడు, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోెుల్ డేవిస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తన్మయి దీక్షిత్, నరేశ్ రాఘవన్, వినోద్ కనుముల తదితరులు పాల్గొన్నారు.