calender_icon.png 6 August, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెమికల్ వ్యర్థాలు పారకుండా అరికట్టాలి

06-08-2025 12:00:00 AM

ఎమ్మెల్యేకు సెవెన్ కాలనీస్ జేఏసీ నాయకుల వినతి 

ఎల్బీనగర్, ఆగస్టు 5 : మన్సూరాబాద్ డివిజన్ లోని వివిధ కాలనీల్లో ప్రవహిస్తున్న కెమికల్ వ్యర్థాలు, డ్రైనేజీ నీరు పారకుండా అరికట్టాలని వివిధ కాలనీల సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మన్సూరాబాద్ డివిజన్ లోని సెవెన్ కాలనీ జాయింట్ యాక్షన్ కమిటీ(సెవెన్ హిల్స్ కాలనీ, స్వాతి గార్డెన్స్, ద్వారక నగర్, డీపీనగర్, హిమపురి కాలనీ 1&2, సౌత్ ఎండ్ పార్క్) సభ్యులు కలిశారు.

పలు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వరద కాల్వలో మూడు నెలలుగా వస్తున్న కెమికల్ వ్యర్థాలు, డ్రైనేజ్ నీరు వస్తున్నట్లు తెలిపారు. మరుగునీరు, కెమికల్ వ్యర్థాలతో ఏడు కాలనీల ప్రజలు తీవ్రమైన అస్వస్థతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కెమికల్ వాటర్ తో చర్మ, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ప్రబలుతున్నాయని, ఆరోగ్యంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నామని చెప్పారు.

రాత్రిపూట కెమికల్ వ్యర్థ రసాయనాలు పొసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఆయా కాలనీల్లో గతంలో అధికారులు పర్యటించి, ప్రతి నిర్మాణాన్ని పరిశీలించారన్నారు. అలాగే కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినట్లు గుర్తు చేశారు.

అధికారులు తిరిగి ఆయా కాలనీల్లో పర్యటించి, కెమికల్ వ్యర్థాలు రాకుండా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. నూతన డ్రైనేజీ నిర్మాణాలపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, అధ్యక్షులు కత్తుల రాంబాబు, కమలాకర్ రావు, బోగోజు మధు, ప్రవీణ్, అజయ్, జనార్దన్, కిశోర్, కృష్ణయ్య, శ్రీనివాస్, రమేష్, జయరాంరెడ్డి, సైదులు, లింగప్ప తదితరులుపాల్గొన్నారు.