03-11-2025 07:33:06 PM
మహా పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన పోచారం, కాసుల..
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప ఆలయం నుండి సోమవారం శబరిమలకు బయలుదేరిన మహా పాదయాత్రను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లతో కలిసి జండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ అయ్యప్ప స్వాముల పాదయాత్ర ఆధ్యాత్మికతకు ప్రతీక అని ఆయన అన్నారు.
గత 16 సంవత్సరాలుగా గురు వినయ్ గురుస్వామి ఆధ్వర్యంలో సువర్ణభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో బాన్సువాడ అయ్యప్ప ఆలయం నుండి భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు శబరిమలైకి పాదయాత్రగా వెళ్లడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సంవత్సరం 80 మంది అయ్యప్ప స్వాములు పాదయాత్రగా వెళ్లడం అయ్యప్ప కృపాకటాక్షాలేనని ఆయన కటాక్షం లేనిది పాదయాత్ర వెళ్లడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
భక్తిశ్రద్ధలతో తెల్లవారుజామున చలికాలంలో చల్లటి నీళ్లతో తానం చేసి గజగజ వనికే సమయంలో అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామికి పూజలు చేయడం అలాగే భక్తి పారవశ్యంలో ప్రత్యేక పూజలు చేయడం ఎంతో గొప్ప విషయమని అయ్యప్ప ఆశీర్వాదం అయ్యప్ప స్వాములపై భక్తులపై ఉండాలని అన్నారు.బాన్సువాడ నుంచి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాముల బృందాన్ని అభినందించారు. అయ్యప్ప స్వాముల పాదయాత్ర ఆధ్యాత్మికతకు ప్రతీకగా, భక్తుల్లో ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలకు దారి చూపుతుందన్నారు.స్వాముల భద్రత, ఆనందంతో శబరిమల యాత్రను పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు అర్షపల్లి సాయి రెడ్డి,మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్, గురు వినయ్, నార్ల సురేష్, ఎజాజ్, గురుస్వాములు, అయ్యప్ప భక్తులు స్వాములు పెద్దఎత్తున పాల్గొన్నారు.