26-09-2025 11:23:02 PM
సమాజంలో బాల్య వివాహాలను అరికట్టి, మహిళల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి
సైబర్ నేరాల పట్ల కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
బాల్యవివాహాన్ని ప్రోత్సహించే వారిపైనా కేసులు నమోదు అవుతాయి: ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి,(విజయక్రాంతి): ఇంట్లో ఒక అమ్మాయి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని, కాబట్టి బాల్యవివాహాలను అరికట్టి, మహిళల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా గ్రామీణ గ్రామీణ అభివృద్ధి శాఖ సెర్ప్ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహాలను అరికట్టడం, మహిళలను సమాజంలో బలోపేతం చేయడం లక్ష్యంగా "మనకోసం మన పిల్లల కోసం" అనే నినాదంతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా యూనిసెఫ్ సహకారంతో సెర్ప్ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్నేహ (సేఫ్టీ, న్యూట్రిషన్ఎం, పవర్మెంట్, హెల్త్, అడోలెసెన్స్) అనే మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సెర్ప్ సభ్యులు స్వయం సహాయక బృందాల ద్వారా సమాజంలో మహిళల అభ్యున్నతి తీసుకురావాలన్నారు.
బాల్యవివాహాలు ఏమైనా దృష్టికి వచ్చినప్పుడు 1098 చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. బాల్య వివాహాన్ని నిర్వహించిన కుటుంబ సభ్యులే కాకుండా, ప్రోత్సహించినవారు కూడా శిక్షార్హులని చెప్పారు. జిల్లాలో ఇటీవల ఒక బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారని సదరు కుటుంబ సభ్యుల పైన కేసులు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. అదేవిధంగా సమాజంలో అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా కట్నం అనేది కూడా నేరమని దీనిని కూడా అరికట్టాలని చెప్పారు.
బాల్య వివాహాలు అరికట్టే బాధ్యత అందరిపై ఉంది: ఎస్పీ రావుల గిరిధర్
సమాజంలో బాల్యవివాహాలు అరికట్టే బాధ్యత కేవలం ఒక శాఖది మాత్రమే కాదని, ఆ బాధ్యత అందరిపై ఉందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. 18 ఏళ్లు నిండకుండా అమ్మాయిలకి పెళ్లిళ్లు చేస్తే వారు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారందరిపై చర్యలు తప్పవని తెలియజేశారు. గతంలో రాజారాం మోహన్ రాయ్ వంటి వారితోపాటు సమాజం అందరూ కృషి చేస్తేనే సతీసహగమనం రూపుమాపగలిగారని తెలిపారు.
సమాజ గతిని తిప్పగలిగిన శక్తి సెర్ప్ వారిదని, కాబట్టి సెర్ప్ సభ్యులు స్వయం సహాయక బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. స్నేహ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐలు అన్ని మండలాల్లో సమన్వయంతో పనిచేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తద్వారా జిల్లాలో బాల్య వివాహాలు, పోక్సో కేసులు పూర్తిగా నివారించాలని తెలిపారు. అదేవిధంగా సమాజంలో అందరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏపీకే ఫైల్స్ వంటి వాటిని ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు.