calender_icon.png 18 August, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిథిలావస్థలో పాఠశాల భవనం...

17-08-2025 10:32:16 PM

గార్ల,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని చిన్నకిష్టపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.వర్షాకాలంలో ఈ భవనం కూలిపోయే ప్రమాదం ఉంది. వెంటనే పాఠశాల భవనంపై అధికారులు ద్రుష్టి సారించి శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని కూల్చివేసి, నూతన భవన నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పాఠశాల భవనం అత్యంత దారుణంగా ఉంది.

శిథిలావస్థలో  ఉన్న పాఠశాల భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.దింతో పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన తరువాత జాగ్రత్తలు తీసుకునే కన్నా, ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలనీ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు విన్నవించుకుంటున్నారు.గోడల పైకప్పుపై పొరలు పడిపోయి విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు.పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది.

శిథిలావస్థలో ఉన్న పాఠశాలలో ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 1991వ సంవత్సరంలో నిర్మించిన పాఠశాల భవనం కూలిపోయి, ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ విద్యాశాఖ ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు పిల్లలను పంపాలంటే భయం వేస్తుందని, ఏ సమయం లో ప్రమాదం జరుగుతుందోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పిల్లలను బడికి పంపుతున్నామని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని కూల్చివేసి, ప్రమాదం నుండి విద్యార్థులను కాపాడాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా అధికారులు కృషి చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.