12-08-2024 12:00:00 AM
ప్రతిఒక్కరూ ఫిట్ గా ఉండాలని కోరుకుంటారు. కానీ చినుకులు పడే వేళ ఒళ్లు బద్ధకిస్తుంది. ఆరోగ్యం పడకేస్తుంది. డైలీ ఎక్సర్‌సైజులు స్కిప్ చేస్తే ఫిట్‌నెస్ దారితప్పుతుంది. మాన్‌సూన్ సీజన్‌లో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చల్లని చినుకులను ఆస్వాదించడంతో పాటు హెల్దీగానూ ఉండొచ్చు.
విటమిన్ సి
వర్షాకాలంలో బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీ లక్షణాలు ఎక్కువగా బాధిస్తాయి. వీటికి చెక్ పెట్టడానికి విటమిన్ సి చాలా అవసరం. విటమిన్ సి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతోంది. రోజువారీ ఆహారంలో మొలకలు, నారింజ, తాజా కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ్యామిలీ డాక్టర్ సలహాలు, సూచనలతో హెల్దీ డైట్ పొందొచ్చు. వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు విటమిన్ సి తో చెక్ పెట్టొచ్చు.
జంక్ ఫుడ్ కు దూరంగా
జంక్ ఫుడ్ లో కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి అతిగా తినకండి. వేయించిన ఆహారాన్ని తినాలని అనిపిస్తే, బదులుగా తేలికైన ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తినాలి. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది. వర్షకాలంలో సరైన ఫుడ్ తీసుకోవడం వల్ల రోజంతా హుషారుగా ఉండొచ్చు.
వర్కవుట్స్
ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి. వర్షాకాలంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అంటువ్యాధులతో పోరాడటానికి మీ శరీరం సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ డీప్ ఫ్రై ఫుడ్, మసాలా ఐటమ్స్ తీసుకుంటే వ్యాయామం అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. ఈ సీజన్ లో వ్యాయామం చేయడం వల్ల మెంటర్ హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇంటికే పరిమితం కాకుండా రన్నింగ్, జాగింగ్ లాంటివి ఎంతో అవసరం. ఒకవేళ చినుకులతో ఇబ్బందులు పడితే ఇంట్లోనే యోగా చేసుకోవచ్చు. ఇంటిలో చిన్న చిన్న పనులు చేయడం వల్ల బాడీకి వ్యాయామం అందించినట్టవుతుంది.
మంచినీరు
చాలామంది మహిళలు రెయినీ సీజన్ లో నీళ్లు తాగడానికి ఇష్టపడరు. పదే పదే వాష్ రూమ్ కు వెళ్లాల్సి వస్తుందనే కారణంతో నీళ్లు తాగడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. అయితే ఇంట్లో ఉన్నో బయట ఉన్నా కచ్చితంగా తగినంత నీళ్లు తాగాలి. సరిపడ నీటిని తాగితేనే వ్యర్థాలు బయటకు వెళ్ళి హెల్దీగా ఉండొచ్చు. అయితే ఈ సీజన్ లో నీటిని వేడి చేసి చల్లార్చి తీసుకోవడం బెటర్. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే ఇంటి నుంచి క్యారీ చేసిన నీళ్లనే తాగాలి.
వ్య క్తిగత శుభ్రత
వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. రోజుకు రెండు పూటల స్నానం చేయడం వల్ల మనసు తేలికగా ఉంటుంది. సూక్ష్మక్రిములు పేరుకుపోకుండా గోళ్ళను కత్తిరించుకోవాలి. లేకపోతే దుమ్ముధూళి కడుపులో చేరి అనారోగ్యానికి దారితీసేలా చేస్తుంది. ఈ సీజన్ లో అలర్జీలూ వేధిస్తుంటాయి. అల్లం, పసుపు, సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల అలర్జీలను దూరం చేయొచ్చు. ఇక వర్షాకాలంలో చాలామంది తడిసిన బూట్లను వేసుకుంటుంటారు. దాంతో చెమట చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఒకవేళ బూట్లు వేసుకోవాల్సి వస్తే వాటికి బదులు చెప్పులను వేసుకోవచ్చు.
ఈ జాగ్రత్తలు అవసరం
* వర్షంలో వీలైనంతవరకు తడవకుండా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని వైరస్ బారిన పడేలా చేస్తుంది. ఒకవేళ వర్షంలోతడిస్తే వెంటనే స్నానం చేయండి.
* ఏదైనా తినడానికి ముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. శానిటైజ్ ద్వారా చేతులను శుభ్రంగా ఉంచుకోవచ్చు.
* ఆకలి వేసినా వేయకపోయినా ఆహారం తీసుకోవాలి.
* తడి బట్టలను వేసుకోకుండా పూర్తిగా ఆరబెట్టిన తర్వాత ఇస్త్రీ చేసిన బట్టలను ధరించాలి.
* చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడానికి వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి.
* జిమ్ లో గంటల కొద్ది వ్యాయామం చేయడం వల్ల చర్మంపై చెమట చేరి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. కాబట్టి వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయాలి.
* దోమల వ్యాప్తిని నిరోధించడానికి ఇంటిలో, చుట్టుపక్కల నిలిచిన నీటిని తొలగించండి. డెంగ్యూ, మలేరియా, చికు న్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను చెక్ పెట్టేందుకు కాయిల్స్, స్ప్రేలను ఉపయోగించండి.
* సోషల్ డిస్టన్స్ తోపాటు అంటు వ్యాధులను నివారించడానికి ఫేస్ మాస్క్ ధరించండి.