22-11-2025 02:02:46 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో నవంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారధిని నిర్మిం చే లక్ష్యంతో, హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ రెండు రోజుల చిత్రోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం, జాతీయ పురస్కార గ్రహీత ఫాదర్ జోసెఫ్ దర్శకత్వం వహించిన త్రిపుర చిత్రం ‘యార్వింగ్’ తొలి ప్రదర్శనను వీక్షించారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, సినిమా అనేది సరిహద్దులు లేని ఒక సార్వత్రిక భాష. అది ప్రాంతాలు, భాషలు, జాతులను దాటి మనుషులను ఏకం చేస్తుంది,అని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యం, తెలంగాణ చైతన్యం కలిస్తే మరింత బలోపేతమైన జాతీయ ఐక్యత సాధ్యమవు తుందన్నారు.
ఈ చిత్రోత్సవాన్ని తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నట్లు స్పెషల్ సీఐపీఆర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎం డీ సీహెచ్ ప్రియాంక తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, టీజీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్, ఐఈపీఆర్ డైరెక్టర్ కిషోర్ బాబు, అదనపు డైరెక్టర్‌డీఎస్. జగన్, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు, దర్శకులు, పలువురు సినీ ప్రము ఖులు పాల్గొన్నారు.