07-05-2025 11:22:00 PM
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): మినీ అంగన్వాడి టీచర్లు, సిఐటియు నిరంతర పోరాట ఫలితమే జీవో నెంబర్ 306 అని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ అన్నారు. మినీ అంగన్వాడీ టీచర్స్ ను మెయిన్ అంగన్వాడీ టీచర్స్ గా అప్డేట్ చేయాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించి సిఐటియు ఆధ్వర్యంలో ఏప్రిల్ 24న, కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలకు డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేసిన పోరాటాల ఫలితంగానే, రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్స్ ను, మెయిన్ అంగన్వాడీ టీచర్స్ గా, అప్ గ్రేడ్ చేస్తూ 306 జీవోను విడుదల చేసిందన్నారు. పోరాడి విజయం సాధించిన నాలుగువేల మంది మినీ అంగన్వాడీ టీచర్లకు అభినందనలు తెలిపారు.
వారికి అండగా నిలబడ్డ మెయిన్ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జీవోలో 12 నెలల పెండింగ్ వేతన బకాయిలపైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, తక్షణమే స్పష్టత ఇవ్వాలన్నారు. 12 నెలల పెండింగ్ వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని, పెండింగ్ వేతనాలకు సరిపడా బడ్జెట్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్డేట్ చేసిన మినీ అంగన్వాడి కేంద్రాలకు ఆయాలను కూడా కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు సిఐటియు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.