07-07-2025 07:15:35 PM
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు జెట్ స్పీడ్ తో తమ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతూనే ఉన్నారు. తాజాగా నల్లగొండలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ జావీద్(Civil Supplies Department Deputy Tahsildar Javed)ను సోమవారం అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. వివరాల్లోకి వెళ్తే... నల్లగొండ జిల్లాలో అందులోనూ మిర్యాలగూడ డివిజన్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తోన్న నాలుగు చక్రాల ఆటోలు, ట్రాలీలను పోలీసులు పట్టుకున్నారు. సదరు రవాణా ఆటోలను అధికారులు సీజ్ చేసి 6(ఏ) కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే జిల్లాలోని మిర్యాలగూడ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ జావీద్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే సివిల్ సప్లై శాఖ సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో కుమ్మకై బాధితుడు నుండి రూ.70 వేలు డిమాండ్ చేశాడు. సదరు డిప్యూటీ తహసీల్దార్ జావీద్, ఆ సందర్భంలో అటు ఏసీబీకి, ఇటు జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారులకు చిక్కకుండా పరారీలో ఉండి తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇటీవల సస్పెన్షన్ చేయడంతో డిప్యూటీ తహసీల్దార్ జావీద్ పరారీలో ఉన్నాడు.