11-05-2025 12:00:00 AM
పహల్గాం దాడికి ప్రతిచర్యగా భారత్ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ సిందూర్ చేపడితే, పాకిస్థాన్ భారత పౌరులనే టార్గెట్ చేసింది. రెండురోజులుగా భారత్ పశ్చిమ ప్రాంత సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ తన క్షిపణి, డ్రోన్ దాడులతో విధ్వంసం సృష్టించేందుకు విఫలయత్నం చేసింది. అయనా, శుక్రవారం పాక్ కాల్పుల్లో విషాదం జరగనే జరిగింది. నివాస ప్రాంతాలపై పాక్ జరిపిన షెల్లింగ్‌లో జమ్ముకశ్మీర్‌లో అనేకమంది గాయపడ్డారు. శనివారం ఉద యం రాజౌరిలో, ఇతర ప్రాంతాల్లో జనావాసాలపైకి విచ్చలవిడిగా పాక్ దళాలు కాల్పులు జరిపాయి.
ఈ ఘటనలో రాజౌరిలోని కశ్మీర్ సీనియర్ అధికారి రాజ్‌కుమార్ ధాపా ప్రాణాలు కోల్పోయారు. ప్రజాసేవకుడిగా, సిన్సియర్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్ మరణించడం మాటలకందని విషాదం. ఆ దాడికి కొద్దిగంటల ముందువరకు కూడా ఆయన విధి నిర్వహణలోనే ఉన్నారు. రాజౌరిలో పాక్ కాల్పులకు మరో నలుగురు పౌరులు కూడా కన్నుమూశారు. భారత్ సరిహద్దులవైపు పాక్ తన సైనిక బలగాలను పెద్ద ఎత్తున మోహరిస్తున్నదనే వార్తలు వస్తున్నాయి.
సరిహద్దు గ్రామాలపై రెండు వారాలుగా రాత్రిపూట షెల్లింగ్ చేస్తున్న పాక్ బలగాలు అనేకమంది గ్రామస్థులను పొట్టన పెట్టుకున్నాయి. రెండు రోజులుగా క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడుతూ భీతావహాన్ని సృష్టించేందుకు పాక్ పన్నాగాలు పన్నుతోంది. భారత్ సైనిక దళాలనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో కొత్త వ్యూహాలకు తెర లేపేందుకు ప్రయత్నిస్తు న్నది. టర్కీనుంచి కొనుగోలు చేసుకున్న డ్రోన్లతో పాకిస్థాన్ దాడులు జరపడం ఆగ్రహం కలిగిస్తున్నది.
కీలకమైన నాలుగు పాక్ వైమానిక స్థావరా లను భారత్ దళాలు ధ్వంసం చేయడం ఈ ఆగ్రహంలో భాగమే. టర్కీలో తయారైన ‘అసిస్‌గార్డ్ సోంగర్’ డ్రోన్లను పాక్ దళాలు పెద్దసంఖ్యలో వినియోగిస్తున్నాయని భారత్ సైన్యం నిర్ధారించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ఎక్కువగా డ్రోన్ దాడులకు పాల్పడుతుండటం తెలిసిందే. తక్కువ ఖర్చుతో డ్రోన్లను కొనుగోలు చేసి ప్రత్యర్థులకు తీవ్ర నష్టం కలిగించడం కొత్త యుద్ధ వ్యూహం.
పాకిస్థాన్ దీనినే అవలంబిస్తున్నది. ఆర్థికంగా చితికిపోయి వున్న పాకిస్థాన్, తుంటరి పిల్లవాడు, అదనంగా పాకెట్ మనీ అడిగినట్టు ఐఎంఎఫ్ నుంచి మళ్లీ రుణం తీసుకొంటున్నది. 1958 నుంచి పాకిస్థాన్ 24 సార్లు ఐఎంఎఫ్ నుంచి బెయిలవుట్‌లు పొందింది. దాయాది దేశం భద్రతకు ముప్పు తెచ్చే చర్యలకే పాకిస్థాన్ తన చేతిలో పడ్డ ప్రతి పైసాను ఉపయోగించాలని చూస్తుంది. అందుకే, భారత్ ఐఎంఎఫ్‌ను కొత్తగా పాకిస్థాన్‌కు రుణం ఇవ్వకూడదని విజ్ఞప్తి చేసింది. ఐఎంఎఫ్ సమావేశానికి వెళ్లకుండా నిరసన తెలిపింది.
పాకిస్థాన్‌కు విదేశాలనుంచి తీసుకున్న రుణాలు ఇప్పుడు 130 బిలియన్ డాలర్ల వరకు ఉంది. ఈ రుణాలను, బెయిలవుట్‌లను పాక్ ఆర్మీ ఎప్పటి కప్పుడు పీల్చేసుకుంటుంది. సైన్యం చెప్పుచేతుల్లో నడిచే పాకిస్థాన్ ప్రభుత్వాలు, ఉగ్రవాదులను పెంచి పోషించే సైనికాధికారులను పల్లెత్తు మాటనకుండా దేశ రక్షణ బడ్జెట్‌ను పెంచేస్తుంటాయి. పాకిస్థాన్ ఈ ఏడాది రక్షణ వ్యయాన్ని ఏకంగా 18 శాతం పెంచింది. ప్రజల సొమ్మును పాకిస్థాన్ పాలకులు, సైనిక జనరళ్లు చక్కగా స్వాహా చేస్తుంటారు. ఈ అవినీతిని చూసి పాక్ ప్రజలే విసిగెత్తి పోయి ఉన్నారు.