12-08-2025 12:00:00 AM
రూటుమారిన గ్రానైట్ రవాణా పట్టించుకోని యంత్రాంగం
మహబూబాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి) : భూమి నుండి గ్రానైట్ రాయిని వెలికి తీసి ఎగుమతి చేయడానికి అనుమతి తీసుకున్న గ్రానైట్ క్వారీల్లో కొన్ని అందుకు విరుద్ధంగా గ్రానైట్ రాయికి బదులు మట్టిని తరలిస్తున్నాయి. నిబంధనల ప్రకారం మైనింగ్ శాఖ నుంచి భూమి నుండి గ్రానైట్ రాయి తీయడానికే ఉంటుంది. రాయిని తీసే సమయంలో మట్టి, ఇతర ఉపయోగం లేని రాళ్లు తీస్తే అనుమతి పొందిన ప్రదేశంలోనే పక్కకు పోయాల్సి ఉంటుంది.
అయితే ఇటీవల మట్టికి డిమాండ్ పెరగడంతో గ్రానైట్ క్వారీల యజమానులు ఏలాంటి అనుమతులు లేకుండా చిన్న చిన్న రాళ్లు, మట్టిని తరలిస్తూ రెండు చేతుల ఆర్జిస్తున్నారు. నిబంధన ప్రకారం గ్రానైట్ క్వారీ అనుమతి పొందిన యాజమాన్యం భూమిలో నుంచి తీసిన రాయికి క్యూబిక్ మీటర్ విధానంలో కొలతలు వేసి ఆ మేరకు మాత్రమే ప్రభుత్వానికి రాయల్టీ చెల్లిస్తారు.
అయితే మట్టి విక్రయిస్తే అందుకు కూడా క్యూబిక్ మీటర్ కొలత చొప్పున ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొందరు గ్రానైట్ క్వారీల యజమానులు రాళ్లకు బదులు మట్టి తీస్తూ బయటకు అక్రమంగా విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక్కో డంపర్ కు నాలుగు వేల రూపాయలు చొప్పున దండుకుంటున్నారని, ఇందులో ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి చెల్లించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
గ్రానైట్ రాయి తీయడానికి అనుమతి పొంది, రాయి లభించని పరిస్థితుల్లో నిర్వహణను (మూత పడ్డ) వదిలేసిన పలు క్వారీల నుండి కూడా ఇప్పుడు మట్టి తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మట్టికి ఇటీవల డిమాండ్ పెరగడంతో ప్రభుత్వ స్థలాల్లో మట్టి తీసే పరిస్థితి లేకపోవడం వల్ల మూతపడ్డ గ్రానైట్ క్వారీలు అణువుగా మారాయి.
దీనితో కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి తదితర మండలాల పరిధిలోని గ్రానైట్ క్వారీల నుండి మట్టి తరలింపు యదేచ్చగా సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి రాయాల్టీ చెల్లించకుండా, అప్పనంగా ప్రతిరోజు వందలాది డంపర్ల కొద్ది మట్టిని తరలించకపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు కేసముద్రం, ఇంటికన్నె, తాళ్లపూస పల్లి,
మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో కొత్తగా చేపట్టిన మూడవ రైల్వే లైన్ పనులకు, నెక్కొండ, నెల్లికుదురు మండలాల పరిధిలో నిర్వహిస్తున్న గ్రీన్ ఫీల్ హైవే పనులకు, ఇతర అభివృద్ధి పనులకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున మట్టి అవసరం పడుతుండడంతో మట్టికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
దీనితో గ్రానైట్ క్వారీల నుండి రాయికి బదులు మట్టిని నిబంధనలకు విరుద్ధంగా బాహాటంగా అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ అటు మైనింగ్, ఇటు రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు ‘మామూలు’గా వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణా వ్యవహారంపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.