24-12-2025 12:33:13 AM
సైబర్ ఉచ్చులో పడకండి: ఎస్సై సర్దాజ్ పాషా
వాట్సాప్ లింక్ నమ్మి రూ.4 లక్షలు పోగొట్టుకున్న పాపన్నపేట్ యువకుడు
బెజ్జూర్, డిసెంబర్ ౨3 (విజయక్రాంతి): నేటి సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ ఎంత అవసరమో.. అంతే ప్రమాదకరమని బెజ్జూర్ ఎస్సై సర్దాజ్ పాషా హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ’సైబర్ నేరాలపై అవగాహన’ కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలోని పాపన్నపేట్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన ఒక గుర్తు తెలియని లింక్ను క్లిక్ చేయడంతో తద్వారా 4 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడని, మర్తీడికి చెందిన ఓ యువకుడు గత కొన్ని సంవత్సరాల క్రితం 6 లక్షలు పోగొట్టుకున్నారు. కుంటల మాన పెళ్లికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ.3 లక్షలు పోగొట్టుకున్నట్టు వెలుగులోకి వచ్చాయి. ఇలా డాటా మీర్ అనే యాప్‌తో మండలంలోని ఎంతోమంది వ్యాపారులు సైతం లక్షల రూపాయలు పోగొట్టుకొని నష్టపోయారు.
సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ డబ్బులు మాత్రం రికవరీ కాలేదని బాధితులు తెలుపుతున్నారు. సదరు వ్యక్తి ఫోన్ పేలో హిస్టరీ చెక్ చేయడంతో తెలియని అకౌంటులకు 4 లక్షల రూపాయలు నాలుగు సార్లుగా తర్జుమా చేయబడ్డాయని ఎస్సై వివరించారు. కష్టపడి సం పాదించిన సొమ్ము క్షణాల్లో మాయం కావడంతో బాధితుడు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాడని తెలిపారు.
యువత జాగ్రత్తగా ఉండాలి: ఎస్సై
ముఖ్యంగా యువత ఇటువంటి ఆకర్షణీయమైన లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సర్దాజ్ పాషా సూచించారు. ‘ఉచితంగా బహుమతులు వస్తాయని, తక్కు వ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చని వచ్చే సందేశాలను నమ్మవద్దు. వాట్సా ప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయ కూడదు‘ అని ఆయన హెచ్చరించారు.
తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దు అన్నారు.బ్యాంక్ వివరాలు, ఓటీపీ (OTP)లు ఎవరికీ చెప్పకూడదనీ, సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, యువకులు గ్రామస్థులు పాల్గొన్నారు.