09-08-2025 12:00:00 AM
వలిగొండ, ఆగస్టు 8: యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో గురువారం రాత్రి 7 గంటలకు ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ జరిగిందా అన్నట్లుగా భారీ వర్షం కురిసింది. రెండు గం టల పాటు ఎడతెరిపి లేకుండా కురవడంతో 11 సెం.మీ.ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షానికి రోడ్లన్నీ కాలువలుగా మారి ప్రవహించగా, డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వలిగొండ మండలంలోని సంగెం వద్ద గల భీమలింగం కత్వ, నెమలికాలువ గ్రామంలో గల ఆసిఫ్ నగర్ కత్వ భారీ వరదతో పరవళ్లు తొక్కుతున్నాయి.
వాగులో కొట్టుకుపోయిన కారు
వలిగొండ, -చౌటుప్పల్ మండలాలకు చెందిన వర్కట్‌పల్లి, -నేలపట్ల గ్రామాల మధ్య గల ఈదుల వాగు గురువారం సాయంత్రం నుంచి కురిసిన వర్షాలకు ఉప్పొంగింది. వాగు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో పాటు పెద్ద కొండూరు చెరువు భారీ ఎత్తున అలుగుపోవడంతో ఈదుల వాగు ప్రమాదకరంగా ప్రవహించింది.
ఇది గమనించకుండా రాత్రి అటుగా వెళ్తున్న కారు వాగులో కొద్ది దూరం కొట్టుకుపోయి చెట్టుకు చిక్కుకుంది. కారులో ఉన్న వారు వర్కుట్‌పల్లి గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదానికి గురికాగా వెంటనే ఆ గ్రామానికి చెందిన బంధువులకు ఫోన్‌లో సమాచారం అందించారు. వర్కట్‌పల్లి గ్రామస్థులు పెద్ద ఎత్తున వాగు వద్దకు చేరుకొని తాళ్ల సహాయంతో కారులోని నలుగురు వ్యక్తులను రాత్రి 10 గంటలకు సురక్షితంగా బయటికి తీసుకొవచ్చారు.