24-07-2024 07:29:50 PM
హైదరాబాద్ : తెలంగాణ పట్ల కేంద్రం వైఖరి ఎలా ఉందో ప్రజలకు తెలియాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రానికి తెలంగాణ నుంచి రూపాయి పోతే 30 పైసలు కూడా రావట్లేదని, తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.67 లక్షల కోట్లు వెళ్లాయని సీఎం తెలిపారు. తెలంగాణకు కేంద్రం పదేళ్లలో కేవలం రూ.1.68 లక్షల కోట్లు ఇచ్చిందని, 5 దక్షిణాది రాష్ట్రాలు మాత్రం కేంద్రానికి రూ.22.66 లక్షల కోట్ల పన్నులు చెల్లించాయని, కేంద్రం ఇచ్చింది కేవలం రూ.6 లక్షల కోట్లు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ నుంచి కేంద్రానికి కేవలం రూ.3.47 లక్షల కోట్లు వెళ్లాగా.. కేందం మాత్రం యూపీలో రూ.6.91 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని ఆయన వెల్లడించారు. పన్నల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇవ్వాలని ఆర్థిక సంఘం చెప్పితే కేంద్రం మంత్రం రాష్ట్రాలకు 32 శాతం పన్నులనే పంచుతోందని సీఎం ఆరోపించారు. పన్నులు కాకుండా సెస్సుల రూపంలో వసూలు చేసుకుని రాష్ట్రాలకు ఎగ్గొడుతోందన్నారు. వచ్చే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని మేం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలని, అందరం ఏకతాటిపైకి వచ్చి కేంద్రం మెడలు వంచాలని రేవంత్ రెడ్డి కోరారు.