04-07-2025 07:16:25 PM
హైదరాబాద్: మాకు ఎదురులేదని భావించిన కల్వకుంట్ల గడీని మూడు రంగుల జెండాను చేతబూని బద్దలు కొట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలనా సాగిస్తున్నామని, కాంగ్రెస్ పాలన మూణ్నాళ్ల ముచ్చటే అని కొందరు అన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటారని.. కలిసి ఉండలేదరని అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఐక్యమత్యంతో పని చేస్తూ అపోహలను పటాపంచలు చేశారని కొనియాడారు. జనగణనతో పాటు కులగణన చేస్తామని, ఎస్సీ వర్గీకరణ చేస్తామని గతంలో రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి చూపించామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 18 నెలల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ మోడల్ ఆవిష్కరించామని, కష్టాలు వచ్చాయి.. ఒడిదుడుకులు వచ్చాయి.. అన్నింటినీ అధిగమించి ముందుకెళ్తున్నామన్నారు.
రైతుల కోసం 18 నెలల్లో రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు చేశామని, వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని గత మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి దేశానికే అదర్శంగా నిలిచామని హర్షం వ్యక్తం చేశారు. రైతు భరోసాతో ప్రభుత్వం విఫలం చెందుతుందని కొందరు ఎదురు చేశారు. కానీ వారి ఆశ నెలవేరలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతు రాజ్యం ఎవరు తెచ్చారో ఎక్కడైనా చర్చ చేసేందుకు సిద్ధం అని, కేసీఆర్, మోదీ, కిషన్ రెడ్డి చర్చకు ఎవరొస్తారో రండి అని సీఎం సవాలు విసిరారు. పేదలు ఎప్పుడూ బర్రెలు, గొర్రెలు మేపుకుంటూనే బతకాలా..? అని కేసీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. తాము తొలి ఏడాదిలోనే 60 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, కేసీఆర్, మోదీకి సవాల్ చేస్తున్న లెక్క కావాలంటే చెప్పండి.. అందర్నీ తీసుకొచ్చి స్టేడియంలో నిలబెట్టి లెక్కవేయిస్తామన్నారు. 60 వేల మందికి ఒక్క తల లెక్క తక్కువ వచ్చినా నీ కాళ్లు మొక్కి తప్పుకుంటా అని ఆయన సవాల్ చేశారు. దక్షిణ కొరియాలో ఒక్క అమ్మాయి మూడు స్వర్ణ పతకాలు తెస్తే.. 140 కోట్ల మంది ఉన్న ఇండియాకు ఒక్కరూ కూడా పతకాలు తేలేదన్నారు.