28-10-2025 06:40:09 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సినీ కార్మికుల సంక్షేమం దిశగా కీలక అడుగు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సినీ కార్మికు సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సినీ వర్కర్స్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు తెలుగు పరిశ్రమ అంటే మదరాసి అని పిలిచేవారని తెలిపారు. కానీ ఆనాటి దివ్వంగత సీఎం మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా కృషి చేసి తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించారని సీఎం పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి వారిని మర్రి చెన్నారెడ్డి సంప్రదించి హైదరాబాద్ కు వచ్చేందుకు కృషి చేశారు.
ఆనాటి నాయకులు చేసిన కృషి చిత్రపురి కాలనీకి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారన్నారు. చిత్రపరిశ్రమను ప్రోత్సహించాలని ఉద్దేశ్యంతో అప్పటి సీఎంలు రామానాయుడు, పద్మాలయా, అన్నపూర్ణ స్టూడియోలకు చౌక ధరకే భూములు ఇచ్చామని, కళాకారులను గౌరవించాలని 1964లో నంది అవార్డు కార్యక్రమాన్ని ప్రారంభించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కళాకారులకు కావాల్సింది డబ్బు కాదు.. జనం కొట్టే చప్పట్లు.. కప్పే దుప్పట్లు.. అని అన్నారు. సినీ కార్మికుల శ్రమ, కష్టం నాకు తెలుసు అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత గత ప్రభుత్వం పదేళ్లు సినీ అవార్డులు ఇవ్వలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గద్దర్ పేరు మీద సినీ అవార్డులు ఇచ్చామని గుర్తు చేశారు.