03-12-2024 06:36:11 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ మైదానంలో హైదరాబాద్ రైజింగ్ వేడుకలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. పారిశుద్య కార్మికులకు భద్రత కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... న్యూయార్క్, టోక్యో తరహాలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలనదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మౌలికవసతుల కల్పనకు రూ.7వేల కోట్లతో హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.
ప్రజాపాలన కోసం ఏడాది క్రితం ప్రజలు తీర్పు ఇచ్చారని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్లు గుర్తు చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధిని పెంచామన్నారు. హైటెక్ సిటీకి నేదురుమిల్లి జనార్ధన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఏపీ సీఎం చంద్రబాబు హైటెక్ సిటీని నిర్మించి కంపెనీలు తీసుకొచ్చేందుకు కృషి చేశారని, అలాగే మెట్రోను హైదరాబాద్ కు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్, రంగారెడ్డి నుంచే వస్తుందని, రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకే మణిహారం లాంటిదన్నారు. రూ.35 వేల కోట్లతో 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ ను నిర్మించబోతున్నామని, ఓఆర్ఆర్ కు అనుబంధంగా ముచ్చర్ల ప్రాంతంలో ప్యూచర్ సిటీని నిర్మిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.