calender_icon.png 17 September, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ వద్ద గుడిసె వేసుకుని జీవించాలి

04-12-2024 01:41:51 AM

  1. కిషన్‌రెడ్డికి  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన  
  2. మూసీ ప్రజల జీవితాలు బాగుపడటం బీఆర్‌ఎస్‌కు ఇష్టంలేదు 
  3. పదేళ్లలో నగర అభివృద్ధికి బీఆర్‌ఎస్ చేసిందేమిలేదు: భట్టి 

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ‘మూసీ పరివాహక ప్రాంతంలో ఒక రోజు నిద్రపోవడం కాదు.. అక్కడే గు డిసె వేసుకొని నువ్వు, నీ కుటుంబం చిరస్థాయిగా జీవించి చూపించాలి’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.   

ప్రజలను మభ్య పెట్ట డానికి మూసీ పరివాహక ప్రాంతంలో ఒక రోజు నిద్రపోయి ఆ తర్వాత నుంచి విలాసమైన ప్యాలెస్‌లో ఉండటం సరికాదని హితవు పలికారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.

నగరం మధ్య నంచి ప్రవహిస్తున్న మూసీకి పునర్జీవం తీసుకొచ్చి మురికి కూపంలో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతోపాటు మూసీని జీవనదిగా మార్చేందుకు తమ ప్రభుత్వం ముందుకుపోతుందని చెప్పారు. అయితే అక్కడి ప్రజల జీవితాలు బాగుపడటం ఇష్టంలేని ప్రతిపక్షాలు.. మూసీ పునర్జీవంకు అడ్డుపడుతున్నాయని ధ్వజమెత్తారు.

హైదరాబాద్ నగరం గుండా 55 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తున్న మూసీని పూర్తిగా ప్రక్షాళన చేసి పునర్జీవం తీసుకురావడానికి ప్రజాప్రభుత్వం కృషిచేస్తుందని పునరుద్ఘాటించారు. గోదావరి నీళ్లతో మూసీకి పునర్జీవం తెచ్చి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి విద, ్య ఉపాధి అవకాశాలు పెంచితే రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించలేమన్న భయంతో బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనదారులు సజావుగా ప్రయాణించేందుకు అండర్ పాస్ బ్రిడ్జిలు, ఫ్లు ఓవర్లు నిర్మాణం, రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను అవసరమైతే ఔటర్ అవతలికి పంపి స్తామని చెప్పారు. హైదరాబాద్‌ను దేశం గర్వించే విధంగా అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి రంగులు వేసుకొని కాలం వెళ్లదీశారని విమర్శించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, నగర ప్రజలకు గోదావరి, కృష్ణ, మంజీరా నీటి పథకాలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని స్పష్టంచేశారు. 

హైదరాబాద్‌కు కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి తేలే : మంత్రి పొన్నం ప్రభాకర్ 

ఢిల్లీకి వచ్చిన ముప్పు హైదరాబాద్‌కు రావద్దని ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లుతోందని, ప్రధానంగా ఈవీ వాహనలను తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ చేయలేని పనులను తమ ప్రభుత్వం చేపట్టి విజయవంతంగా ముందుకెళ్లుతోందని స్పష్టంచేశారు.

హైదరాబాద్‌కు తాగునీటిని తీసుకొచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి తాపత్రయమని, నగరంలో పెట్రోల్, డీజిల్ వాహనాలు తగ్గించి ఈవీ వాహనాలు తీసుకొచ్చేందుకు నూతన విధానం ప్రవేశపెట్టామన్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి నగరాభివృద్దికి ఒక్క రూపాయి తీసుకురాలేదని విమర్వించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీలు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. 

మహానగర అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 

మహానగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందని, అందుకోసం రూ.7 వేల కోట్లకు సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. మూసీకి పునర్జీవం చేయాలని, గోదావరి జలాలను తరలించి బాగుచేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు.

గత ఏడాది డిసెంబర్ 3న బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజలు ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వెల్లడించారు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్య జలాలు మూసీలో కలవకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.