03-12-2024 05:58:06 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లో అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి గత ప్రభుత్వం ఏం చేయలేదని, గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ చేసినట్లు చెప్పుకుందన్నారు. ప్రజల జీవనానికి అనుగుణంగా కాంగ్రెస్ సౌకార్యాలు కల్పించిందని, తెలంగాణ రాష్ట్రానికే హైదరాబాద్ తలమాణికం అని భట్టి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో నదులను పరిశుభ్రంగా ఉంచి, వాటి చుట్టూ పర్యాటకం అభివృద్ధి చేసి ఆర్థికంగా అభివృద్ది చెందాయని వెల్లడించారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం మూసీ పునరుజ్జీవనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదల్చలేమని, ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా మూసీ పునరుజ్జీవనంపై కుట్ర చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు. మూసీ పరివాహాక ప్రజలు అభివృద్ధి చెందకూడదని బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని, వాళ్లు ఎన్ని కుట్రలు చేసిన మూసీ పునరుజ్జీవనం కోసం ఖర్చుకు వెనుకాడమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో 400 మురికి వాడలు ఉన్నాయని, వారికి మెప్మా ద్వారా రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ లోనూ కాలుష్యం వచ్చే అవకాశం ఉందని నివేదికలు వస్తున్నాయని, భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత నగరంగా హైదరాబాద్ ను అందించేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.