12-09-2025 12:15:56 AM
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్, సెప్టెంబర్ 11: నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం తరఫున అందిస్తున్న ఉచిత ఇసుకను ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి గురువారం జుక్కల్ శివారులోని స్థానిక మార్కెట్ యార్డు గోదాం సమీపంలో ఇసుక రవాణాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం తరఫున 8 ట్రాక్టర్ల ఉచిత ఇసుకను అందిస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారులు స్థానిక పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి పూర్తి వివరాలతో ఇసుకను తీసుకెళ్లే సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇసుకను తీసుకెళ్లేందుకు లబ్ధిదారులు వారి సొంత వాహనాలను సమకూర్చుకోవాలని సూచించారు.
గత కొన్ని రోజులుగా ఇసుక పంపిణీ కార్యక్రమంలో ఆలస్యం జరిగిందని, ఇకనుండి ఆలస్యం జరగదని పేర్కొన్నారు. లబ్ధిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం నియోజకవర్గంలో ఏ ఒక్క లబ్ధిదారునికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర అధికారులు పాల్గొన్నారు.