calender_icon.png 12 September, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలి

12-09-2025 12:14:12 AM

నారాయణపేట.సెప్టెంబరు 11(విజయక్రాంతి) : సర్కారు దవాఖానాల్లో అందించే వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. అన్ని వసతి సౌకర్యాలతో పాటు, వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు అవుతుందన్నారు. కోస్గి పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, రక్త పరీక్షల గది, మెయిల్, ఫిమేల్, చిన్నపిల్లల వార్డులతో పాటు రక్త పరీక్షల గది, ఎక్స్ రే, ల్యాబ్ గదులను ఆమె పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరు ఏ రుగ్మతతో వచ్చారని వాకబు చేశారు. అనంతరం ఆస్పత్రిలోని వైద్య బృందంతో ఆస్పత్రి ప్రగతి, పనితీరు పై సమీక్ష జరిపారు.

ఆస్పత్రికి సంబంధించిన ప్రగతి నివేదికను, పలు రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు అందించిన వైద్య సేవల పూర్తి వివరాలు, ఆస్పత్రికి అవసరమైన సదుపాయాలు సౌకర్యాలు ఏమేమి అవసరమో ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని డిసిహెచ్‌ఎస్ డాక్టర్ మల్లికార్జున్ ను ఆదేశించారు. 

మద్దూరు సీ హెచ్ సీ పరిశీలన

మద్దూరు కమిటీ ఆరోగ్య కేంద్రంలో ఎక్స్ రే సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం మద్దూరు సీ హెచ్ సీ ను ఆమె తనిఖీ చేసి, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లల వార్డు, జనరల్ వార్డ్ ను పరిశీలించారు. ఆస్పత్రి కి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందు తున్నాయని ఆరా తీశారు.

కాడ నుంచి మంజూరైన రూ.25 లక్షల నిధులతో చేపట్టే ఆస్పత్రి ప్రహరీ గోడ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయని ఆర్ ఎం ఓ పావని ని అడిగారు. అలాగే ఆస్పత్రికి మంజూరైన రూ.30 లక్షల జనరేటర్ వినియోగం గురించి వాకబు చేశారు. ఇంకా ఏవైనా రిక్వైర్మింట్స్ ఉంటే ప్రతిపాదన సిద్ధం చేసి పూర్తి నివేదికను తయారు చేసుకోవాలనిసూచించారు.