28-05-2025 01:34:22 AM
లగచర్లకో న్యాయం.. నిమ్జ్ బాధితులకు మరో న్యాయమా?
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిమ్జ్ బాధితుల ధర్నా
సంగారెడ్డి, మే 27(విజయక్రాంతి): ఎవడబ్బ జాగీరని పేదల భూముల్ని తక్కువ పరిహారమిచ్చి అప్పనంగా లాక్కుంటున్నారని, సీఎం రేవంత్రెడ్డికి ఉన్న భూముల్నిగానీ...మాజీ సీఎం కేసీఆర్ ఫామ్మౌస్ భూముల్నీగాని కేవలం రూ.15 లక్షలకే ఎకరం చొప్పున అమ్మగలరా..అంటూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తీవ్రంగా విమర్శించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమానికి ముందు స్థానిక పీఎస్‌ఆర్ గార్డెన్ నుండి వేలాది మందితో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ధర్నానుద్దేశించి మాట్లాడుతూ జహీరాబాద్ నిమ్జ్ రైతులకు 2013 చట్టం ప్రకారం మార్కెట్ ధరపై మూడిరతలు అదనంగా నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ప్రతి ఎకరాలకు 120 గజాల ప్లాట్ను ఇవ్వాలని, లేని పక్షంలో పారిశ్రామిక వేత్తలనే కాదు స్వయంగా సీఎం రేవంత్రెడ్డి వచ్చినా నిమ్జ్ భూముల్లో అడుగు పెట్టనీయమని హెచ్చరించారు.
జహీరాబాద్ ప్రాంతంలో ఎకరం భూమి ధర రూ.50 లక్షలకు పైనే పలుకుతుందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్జ్ కోసం తీసుకుంటున్న భూములకు కేవలం ఎకరాకు రూ.15 లక్షల పరిహారమే ఇస్తుందన్నారు. పేదల రైతుల భూముల్ని తక్కువ పరిహారంతోనే లాక్కోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రజా పాలన జపం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఇటీవల జహీరాబాద్ ప్రాంతంలో పర్యటనకొచ్చి వేలాది ఎకరాల భూముల్ని కోల్పోతున్న రైతుల గురించి కనీస ప్రస్తావన చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.
పైగా ప్రజలు, రైతులు, ప్రజల కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం) నాయకుల్ని అరెస్టు చేసి నిర్బంధించారని, ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధరపై మూడిరతల నష్టపరిహారం చెల్లించాలన్నారు. లగచర్ల, ముచ్చర్ల భూ సేకరణలో మూడింతలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. అక్కడో న్యాయం ఇక్కడో న్యాయం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం అప్రజాస్వామికమన్నారు.
జిల్లా కలెక్టర్ రైతులతో చర్చలు జరిపి న్యాయమైన పరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వంలో మాట్లాడాల్సిన బాధ్యత ఉందన్నారు. న్యాయమైన పరిహారం కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడేందుకు సిద్దంగా ఉండాలని పిలుపు నిచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఎఓకు సమస్యలతో కూడిన వితనపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జహీరాబాద్ ఏరియా కార్యదర్శి బి.రాంచంద్రం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.రాజయ్య, అతిమేల మానిక్, జి.సాయిలు, ఎం.నర్సింహులు, ఎం.యాదగిరి, మహిపాల్, నాగేశ్వర్రావు, విద్యాసాగ్నర్, కృష్ణ, కె.రాజయ్య, అశోక్, శ్రీనివాస్‌పాల్గొన్నారు.