calender_icon.png 5 September, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా అండగా నిలిచింది

03-09-2025 02:22:06 PM

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఎస్జీడీ ఫార్మా(SGD Pharma) రెండో యూనిట్ ను సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి మహబూబ్‌నగర్ జిల్లా వేదిక కాబోతుందని అన్నారు. పాలమూరు జిల్లా ఒకనాడు వలసలకు మారుపేరు అని, పాలమూరు బిడ్డల భాగస్వామ్యం లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదని తెలిపారు. చదువు, నీళ్లు జిల్లా ప్రజలకు అందుబాటులో లేక వలసలు పోయారని, కృష్ణా జలాలు పక్క నుంచి వెళుతున్న కూడా సాగునీటి సమస్యలు తలెత్తాయని అన్నారు.

సమస్య పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేయలేదని, తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా అండగా నిలిచిందన్నారు. కేసీఆర్ ను మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిపించారని.. ఎంపీగా గెలిపించినా మన ప్రాంతానికి కేసీఆర్ సముచిత న్యాయం చేయలేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయంలో పలు ప్రాజెక్టులు సంపూర్ణంగా పూర్తి కాలేదని, పేరుకే పాలమూరు వర్సిటీ అయినా.. పీజీ కాలేజీగానే మిగిలిందన్నారు. చదువు, ఉపాధి, నీటిపారుదలలో జిల్లాను అభివృద్ది చేసుకోవాలని.. ప్రణాళికలు రచించుకోకపోతే జిల్లాకు శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని అన్నారు. జిల్లాకు ట్రిపుల్ ఐటీని మంజూరు చేసుకున్నామని, 14 అసెంబ్లీ స్థానాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.