03-09-2025 02:09:08 PM
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై కవిత(Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు నక్కజిత్తులు గమనించుకో రామన్న అంటూ జాగృతి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత అన్నారు. రేవంత్ రెడ్డికి హరీశ్ రావు ఎప్పుడో లొంగిపోయారని ఆరోపించారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడిన తీరు చూస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ కనబడట్లేదా? అన్నారు. హరీశ్ రావు గురించి ఏమాత్రం మాట్లాడరుగానీ.. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. బీర్ఎస్ లో పనిచేస్తున్న అసలైన కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో మొదట్నుంచీ హరీశ్ రావు లేరు.. రూ. కోటి తీసుకుని వ్యాపారం కోసం ఎక్కడికో వెళ్లారని వార్తలు కూడా వచ్చాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టాక 10 నెలల తర్వాత వచ్చారని, అంతకు ముందు హరీశ్(Thanneeru Harish Rao) లేరని ఆరోపించారు. పార్టీకి చెడ్డపేరు రాగానే వైఎస్ ను హరీశ్ రావు కలిసింది అందరూ చూశారని తెలిపారు. ట్రబుల్ సృష్టించింది హరీషే.. మళ్లీ పరిష్కరించినట్లు ప్రచారం చేసుకున్నారని చెప్పారు.
నేరెళ్ల ఇసుక దందాలో సంతోష్ పాపం దళితులపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు దళిత కుటుంబాలపై థర్డ్ డిగ్రీకి కారణం సంతోష్ అన్నారు. కుంభకోణం సంతోష్ ది.. చెడ్డపేరు కేటీఆర్ కు అన్నారు. పోచంపల్లి శ్రీనివాస రెడ్డి(Pochampally Srinivasa Reddy), మేఘా వాళ్లు కలిసి రూ.750 కోట్ల విలువైన విల్లా ప్రాజెక్టు చేస్తున్నారు. విల్లా ప్రాజెక్టుకు డబ్బులు ఎక్కణ్నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సామన్య, మధ్యతరగతి కుటుంబం నుంచి ఎలా ఎదిగారు. పోచంపల్లి విషయం నేను చెప్పింది కాదు.. పల్లా రాజేశ్వర్ రెడ్డే(Palla Rajeshwar Reddy) చెప్పారని వివరించారు. నవీన్ రావుకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్.. పేరు మాత్రం సంతోష్ కా?(Joginapally Santosh Kumar) అని ప్రశ్నించారు. ఇన్ని ఆరోపణలున్న సంతోష్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఇంత స్పష్టమైన వివరాలు ఇస్తున్నా.. రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు 27 ఏళ్లు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం రాజకీయాల్లోకి వచ్చానని, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేశా.. ఆత్మగౌరవానికి ప్రతీకగా పనిచేశానని చెప్పారు. తెరాస కోసం ఎంత చేశానన్నది అందరికీ తెలిసిందే అన్నారు. హరీష్, సంతోష్ గురించి ఆలోచించాలని మా నాన్నకు బిడ్డగా చెబుతున్నా అన్న కవిత నన్ను సస్పెండ్ చేశారు.. ఇబ్బంది లేదు.. హరీశ్, సంతోష్ గురించి ఆలోచించండన్నారు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా.. ప్రతిఒక్కరికి సమయం వచ్చినప్పుడు అది తెలుస్తోందని పేర్కొన్నారు.
నేను ఏ పార్టీలోనూ చేరను.. నాకు ఏ పార్టీతోనూ అవసరం లేదు
నేను ఇతర పార్టీల్లో చేరుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. నేను ఏ పార్టీలోనూ చేరను.. నాకు ఏ పార్టీతోనూ అవసరం లేదని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై జాగృతి కార్యకర్తలు(Telangana Jagruthi), తెలంగాణ మేధావులతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తొందరపడి నిర్ణయం తీసుకునే అవసరం తనకు లేదని తెలిపారు. జరిగిన పరిణామాలు ఒక్కోటి ఎదుర్కొంటూ వస్తున్నానని పేర్కొన్నారు. నిన్న జరిగింది నా జీవితంలో అతి ముఖ్యమైన పరిణామం అన్నారు. భవిష్యత్తులో చాలా విషయాలు బయటపెడతాను.. ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు. సంతోష్, హరీశ్ గ్యాంగ్ లు బీఆర్ఎస్ కు పట్టిన జలగలు అన్నారు. తాను ప్రజల వద్దకే వెళ్తా అన్న కవిత.. సంతోష్ రావు కూరలో ఉప్పులాంటి వారని తెలిపారు.