21-05-2025 01:06:14 AM
సీఎం వెళ్లే రూట్ క్లీన్
జహీరాబాద్, మే 20: జహీరాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వస్తున్నాడని నాయకులు, అధికారులు, కార్యకర్తలు హల్చల్ చేస్తున్నారు. అధికారికంగా ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కానప్పటికీ జహీరాబాద్ నియోజకవర్గంలోని అతిపెద్ద పారిశ్రామికవాడ నెలకొల్పే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రోడ్డును ప్రారంభిస్తారని, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయంతో పాటు జహీరాబాద్ లో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని కూడా సీఎం ప్రారంభించనున్నారు.
సీఎం వెళ్లే రోడ్డు వెంబడి మొక్కలు నాటడం, చెత్తాచెదారాలను తొలగించడం అధికారులు ఆగమేఘాలమీద చేపడుతున్నారు. బర్దిపూర్ కుప్పనగర్, మాచునూరు తదితర గ్రామాలకు చెందిన ఉపాధి హామీ కూలీలతో రోడ్డు వెంబడి గడ్డిని తొలగించడంతో పాటు గతంలో నాటిన చెట్లను వాటిని శుభ్రపరచి చెట్లు కింద పడకుండా ఆధారంగా కట్టెలను ఏర్పాటు చేస్తున్నారు.
వివిధ గ్రామాల గ్రామ కార్యదర్శులు, ప్రజా ప్రతిని ధులు పనులను పర్యవేక్షిస్తున్నారు. మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ నేతృత్వంలో జహీరా బాద్ లో బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అల్గోల్ రోడ్డు వెంబడి బైపాస్ దగ్గర గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పస్సాపూర్ సమీపంలోని నారింజ బ్రిడ్జిపై గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన మట్టిని తొలగించ లేదు గానీ సీఎం వస్తున్నాడని ఆ మట్టిని జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రాకతో రోడ్ల పక్కన చెత్తాచెదారాన్ని తొలగించడం వల్ల సుందరంగా మారుతున్నాయి.