21-05-2025 12:57:47 AM
అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారాలి ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహా
సంగారెడ్డి, మే 20(విజయక్రాంతి): ప్రభుత్వ శాఖల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని, అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ఈనెల 23వ తేదీన జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈనెల 23వ తారీకున సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ ,బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు,హెలిప్యాడ్, హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహావిష్కరణ, కేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం, మహిళా పెట్రోల్ బంకు, జిల్లా అభివృద్ధికి కావలసిన కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసి, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి సభలో పాల్గొంటారని తెలిపారు.
జహీరాబాద్ ఎంపీ సురేష్ శేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు రావడం చాలా సంతోషమని, జిల్లా అభివృద్ధిలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకుందామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గానికి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి ,ప్రజలందరికీ ఉపాధి కల్పించిందని గుర్తు చేశారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని, పక్కా ప్రణాళికతో సీఎం పర్యటన విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.