23-11-2025 12:00:00 AM
థలసేమియా పిల్లలకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో భారీ లబ్ధి
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): థలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) కీలక ముందడుగు వేసింది. సీఎస్‌ఆర్‌లో భాగంగా ‘థలసేమియా బాల్ సేవా యోజన’ కింద బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స అందించేందుకు రెయిన్‌బో చిల్డ్రన్స్ ఫౌండేషన్‌తో శనివారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో ఒప్పందం జరిగింది. సీఐఎల్ తరఫున జీఎం (సీఎస్‌ఆర్) రేఖా పాండే, రెయిన్బో చిల్డ్రన్స్ ఫౌండేషన్ తరఫున గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డా. కె. ప్రశాంత్ ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. సీఐఎల్ చైర్మన్ సనోజ్ కుమార్ ఝా, డైరెక్టర్ (హెచ్‌ఐర్) డా. వినయ్ రంజన్ పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడు తూ.. థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి రక్త రుగ్మతలకు చికిత్స కోసం ఇకపై నిరుపేద కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, హైదరా బాద్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ టీబీఎస్‌వై పథకం కింద 18వ బీఎంటీ కేంద్రంగా మారిందన్నారు. ఈ ఎంఓయూ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రాలలోని పేద రోగులకు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రెయిన్బో హాస్పిటల్స్ పీడియాట్రిక్ హెమటాలజీ, ఆంకాలజీ, బీఎంటీ విభాగం అధిపతి డా. శిరీష రాణి మాట్లాడుతూ..
ఈ ఒప్పందం పేద పిల్లలకు నాణ్యమైన చికిత్సను అందించడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుందని, గతంలో అందుబాటులో లేని ఈ విధానం, నేడు ఈ అత్యవసర చికిత్సను పొందడానికి అనేక కుటుంబాలను ప్రోత్సహిస్తుందని ఆమె తెలిపారు. డా. దినేష్ కుమార్ చిర్ల (హోల్టైమ్ డైరెక్టర్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్) ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, కోల్ ఇండియా అందించే సహకారంతో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్‌కు అనేక కుటుంబాలను ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.