10-11-2025 01:40:36 AM
కీసర, నవంబరు 9 (విజయక్రాంతి): పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా శ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ సామూహిక వ్రతంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కార్తీక మాసం పరమ పవిత్రమైనది కావడం వల్ల, దేవస్థానంలో సత్యనారాయణ వ్రతాల నిర్వహణతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది.
భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని, భక్తిశ్రద్ధలతో వ్రతంలో పాల్గొన్నారు. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా జరిగింది. వ్రతానంతరం భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం, దేవాలయం వెలుపల ఉన్న సప్తవృక్షాలు మరియు నాగదేవత సన్నిధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ , ధర్మకర్త శ్రీహరి పాల్గొన్నరు . కార్తీక మాసం సందర్భంగా దేవస్థానంలో మరిన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది .