10-11-2025 01:39:25 AM
ట్రస్టు బోర్డు ఏర్పాటుకు ఎండోమెంట్ శాఖ కసరత్తు
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు
మేడ్చల్, నవంబర్ 9 (విజయ క్రాంతి): మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి పూడూరు గ్రామంలోని శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ ఆలయ నిర్వహణ విషయంలో వివాదం నెలకొంది.పూడూరు గ్రామ నడిబొడ్డున 25సంవత్సరాల క్రితం శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ ఆలయాన్ని నిర్మిం చారు. కాగా అప్పట్లో గ్రామస్తులందరూ కలిసి గ్రామంలోని వివిధ కులాలకు చెందిన వ్యక్తులను కలుపుకొని ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు .సదరు ఆ కమిటీ ఆధ్వర్యంలోనే మూడేళ్లకొక్క సారి బోనాల జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఆలయం నిర్మించినప్పటి నుండి నేటి వరకు ఆలయ నిర్వహణ మొత్తం కమిటీ ఆధ్వర్యంలోని కొనసాగుతుంది.ఇది ఇలా ఉండగా గ్రామం లోని మరి కొంతమంది వ్యక్తులు సైతం కమిటీలో తమకు కూడా అవకాశం ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా బోనాల జాతర ముందు ఏర్పాట్ల చర్చల సందర్భంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.వీరి డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్న కమిటీ సభ్యులు ఆసక్తి ఉన్నవారు పేర్లు ఇవ్వాలని కోరడంతో ఇచ్చారు.
ఇదే సంవత్సరం మే నెలలో నిర్వహించిన జాతర ఉత్సవాలకు ముందు సైతం కమిటీ సభ్యులకు గ్రామంలోని మరి కొంతమంది వ్యక్తులకు కమిటీ నిర్వహణ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది.దీంతో వారు జాతర ముగిసిన అనంతరం ఆగస్ట్ నెలలో శ్రీ శివంపేట పోచమ్మ-మైసమ్మ ఆలయానికి ప్రభుత్వ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని విన్నవించారు.వెంటనే స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు అదే నెల 18వ తేదీన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కోసం నోటీసులు జారీచేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరారు.ఈ ఘటన గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి ఇటీవల రావడంతో అప్రమత్తమైన కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామస్తుల సంతకాలు సేకరించి పంపించినట్లుగా తెలిసింది.