01-07-2025 06:22:49 PM
ఖమ్మం (విజయక్రాంతి): జిల్లాలోని మంచుకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులతో కలిసి మంగళవారం కలెక్టర్ అనుదీప్(Collector Anudeep Durishetty), జిల్లా విద్యాధికారి సత్యనారాయణ(District Education Officer Satyanarayana) మధ్యాహ్న భోజనం చేశారు. ముందుగా పిల్లలతో కలెక్టర్ మాట్లాడి వారు ఏవిధంగా చదువుతున్నారో అడిగి తెలుసుకొన్నారు. తెలుగు పద్యాలు, ఆంగ్లం చదివే పరిజ్ఞానాన్ని కలెక్టర్ పరిశీలించారు. మీరు బాగా చదివి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. పాఠశాలలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతి విద్యార్థికి తెలుగు చదవడం, ఇంగ్లీష్ మాట్లాడటం అనర్గళంగా వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులతో చెప్పారు.
పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేటట్లు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని, ఇందుకు ప్రారంభం నుండే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు ప్రతిరోజు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎస్. సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయురాలు కరుణ కుమారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.