01-07-2025 06:19:16 PM
బాధితులకు అందజేత..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణ పోలీస్ సర్కిల్ పరిధిలో మొబైల్ ఫోన్ వినియోగదారులు పోగొట్టుకున్న ఫోన్లను పట్టణ పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందచేశారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ శశిధర్ రెడ్డి(CI Shashidhar Reddy) బాధితులకు మొబైల్ ఫోన్లను అందచేసి మాట్లాడారు. ప్రజల ఆస్తుల పరిరక్షణే తమ కర్తవ్యమన్నారు. పట్టణ పోలీసులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను సాధించారని కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్(Central Equipment Identity Register) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు పోగొట్టుకున్న, చోరీకి గురైన 197 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇటీవల రికవరీ చేసిన 1.2 లక్షల విలువైన 7 మొబైల్ ఫోన్లను బాధితులకు అందచేశారు. ప్రజల ఆస్తులను కాపాడటంలో, నేరాలను అరికట్టడంలో పోలీస్ శాఖ నిరంతరం ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సీఈఐఆర్ పోర్టల్‌లో 280 ఫిర్యాదులు నమోదు కాగా, ప్రత్యేక బృందాల కృషితో 197 ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అప్పగించామని, మిగిలిన ఫోన్లను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అంతర్భాగమని, దానిని పోగొట్టుకున్నప్పుడు ప్రజలు పడే ఆవేదనను అర్థం చేసుకొని అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో వారికి సత్వర సేవలు అందించడమే మా లక్ష్యం అన్నారు.
ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టు కున్నా లేదా దొంగతనానికి గురైనా, ఆందోళన చెందకుండా వెంటనే వెంటనే www.ceir.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్‌ను బ్లాక్ చేయాలని, అదేవిధంగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు తక్కువ ధరకు మొబైల్ ఫోన్లు అమ్మినట్లయితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కొనవద్దని అటువంటి వ్యక్తుల సమాచారం పోలీసులకు అందచేయాలని కోరారు. మొబైల్ ఫోన్ల రికవరీలో కీలకపాత్ర పోషించిన టెక్నికల్ టీం కానిస్టేబుల్ శ్రీనివాస్ ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.