30-01-2026 12:00:00 AM
ఖమ్మం, జనవరి 29 (విజయ క్రాంతి): కలెక్టరేట్ మొదటి అంతస్తు, ఎఫ్-3లో గల జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా కేంద్రాన్ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి గురువారం ప్రారంభించారు. పురపాలక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై మీడియా కేంద్రం ద్వారా నిఘా పెట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల సంబంధ సమాచారం మీడియాకు ఎప్పటికప్పుడు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. ప్రింట్ మీడియాలో ప్రచార ఖర్చుపై నిఘా, ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రచార అనుమతులకు జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మీడియా మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.ఏ. గౌస్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మీడియా మానిటరింగ్ కమిటీ సభ్యులు, కార్యాలయ టైపిస్ట్ కె. ప్రవల్లిక, కంప్యూటర్ ఆపరేటర్లు నవీన్, హరీష్, సిబ్బంది తదితరులు ఉన్నారు.