calender_icon.png 30 December, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగ నిర్ధారణకు చెక్..

30-12-2025 12:00:00 AM

చట్టం అతిక్రమిస్తే అనుమతులు రద్దు

స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా

జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశంలో కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, అటువంటి అక్రమాలకు పాల్పడే ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అనుమతులు రద్దు చేస్తామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్కానింగ్ అనంతరం పిండ లింగాన్ని వెల్లడించిన వైద్యులు, యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో 39 స్కానింగ్ సెంటర్లు పనిచేస్తుండగా, వాటిపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తి ఆందోళనకరంగా తగ్గిందని, వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 890 మంది అమ్మాయిలే ఉన్నారని అక్రమ అబార్షన్లే ఇందుకు ప్రధాన కారణమన్నారు. చట్ట అమలులో భాగంగా స్కూళ్లు, కాలేజీల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆడపిల్ల పుట్టడమే నేరంలా భావించి అబార్షన్లు చేయించడం అమానుషమని లింగ నిర్ధారణతో పాటు అక్రమ అబార్షన్లు చేసే డాక్టర్లు, ఆసుపత్రులపై ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, ఇంచార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి నాయక్, కమిటీ సభ్యులు డాక్టర్ చెన్నయ్య, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, జిల్లా చైల్ ప్రొటెక్షన్ చైర్మన్ లక్ష్మణరావు, డాక్టర్ తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.