30-09-2025 12:00:00 AM
ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల సందర్శన
ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి దరఖాస్తులపై సమీక్ష
నిజామాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : ఎడపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు
క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల ప్రగతి గురించి ఆరా తీశారు. లబ్దిదారులు అందరూ నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. చేసుకునేలా చూడాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు.