26-08-2025 01:15:27 AM
మట్టి వినాయక విగ్రహా పోస్టర్ ను ఆవిష్కరించి, మట్టి విగ్రహాలు పంపిణీ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి ఆగస్టు 25 (విజయ క్రాంతి) జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం మనమంతా మట్టి గణపతులను పూజించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజలను కోరారు.సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో మట్టి వినాయక విగ్రహా పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి పై ఉందని, మట్టి వినాయకులను పూజించాలని చేసే అవగాహన కార్యక్రమంలో భాగంగా బస్ స్టాప్, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వాల్ పోస్టర్లను ప్రదర్శన చేయాలన్నారు.కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేస్తూ పర్యావరణం పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రంగులు ఉపయోగించి తయారు చేసిన గణపతి విగ్రహాల వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని, ఎక్కువ కాలం కరగకుండా నీటిలో ఉండడం వలన నీటిలో ఉన్న స్వచ్ఛత పోతుందని, నీటిలో జీవించే ప్రాణులకు హాని కలుగుతుందని, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, మట్టి గణపతిని పూజించాలని ఆయన సూచించారు.
మట్టి వినాయక విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడవచ్చునని ఆయన వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రంగా రెడ్డి, ఈఈ పొల్యూషన్ కంట్రోల్ బో ర్డు బిక్షపతి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ బండి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.