23-10-2025 06:33:41 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గురువారం స్థలాన్ని పరిశీలించారు. కామారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని సందర్శించి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న ఓల్డ్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయడానికి నిర్ణయించినందున ఇంజనీరింగ్ కాలేజ్ సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, త్రాగునీరు, టాయిలెట్స్, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చిమొక్కలు పూర్తిగా తొలగించాలని, అవసరమైన చోట ఫ్లోరింగ్ చేయించాలని సూచించారు.
గదులు శుభ్రతతో పాటు, మరమ్మత్తులు చేయించి ఆన్ని మౌళిక వసతులు ఏర్పాటు చేసి సైన్స్ మ్యూజియం విజయవంతం చేయాలని సంబంధిత అధికారులు మున్సిపల్ అధికారులు, పంచాయితి రాజ్ అధికారులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ ను ఆదేశించారు. జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంతో పాటు శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. విద్యార్థులు, యువత ప్రజలకు విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తి పెంపొందించడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రభాకర్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, స్థానిక మండల రెవెన్యూ అధికారి జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.