calender_icon.png 2 October, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్

02-10-2025 12:40:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 1, (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం పాల్వంచ మండలం తోగూడెం2 అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడి కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించి, పోషణ్ వాటిక (Nutrition Garden) ఏర్పాటు విషయమై అవసరమైన సూచనలు, సలహాలు అందజేశారు.

ప్రతి అంగన్వాడి కేంద్రంలో పోషకాహారానికి తోడ్పడే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు నాటాలని, వాటిని సమర్థవంతంగా సంరక్షించడం ద్వారా చిన్నారులు, గర్భిణి, పాలిచ్చే తల్లులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తల్లిశిశు ఆరోగ్యంపై విశేషంగా చర్చించారు. ముఖ్యంగా ఇంటికి తీసుకెళ్లే పౌష్టికాహారం పంపిణీ విధానం పై సమీక్ష జరిపి, తల్లుల నుండి నేరుగా బాలామృతం వినియోగం ఎలా జరుగుతోంది? పిల్లలు తీసుకుంటున్నారా?

ఏమైనా సమస్యలు ఉన్నాయా? అన్న అంశాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. తల్లులు అందిస్తున్న సమాధానాలను శ్రద్ధగా విని, అవసరమైన చోట తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోషకాహార లోపం రాకుండా అంగన్వాడి కేంద్రాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి అంగన్వాడి కేంద్రం సమయానికి ఇంటికి తీసుకెళ్లే పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులు ఆహారం తీసుకునేలా పర్యవేక్షించాలి. పోషణ్ వాటికల ద్వారా స్వయం పూర్ణత సాధించడమే లక్ష్యం కావాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న, ఎంపీడీఓ, సూపర్వైజర్ అశోక , ఏపీఓ తదితర అధికారులు పాల్గొన్నారు.