calender_icon.png 8 August, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ పల్లెనిద్రలో.. సమస్యలు ఎన్నెన్నో

08-08-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి ఆగస్టు 7 ( విజయ క్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం దూది వెంకటాపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే మార్నింగ్ వాక్ లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు పాల్గొన్నారు.  గురువారం రోజు ఉదయం 6 గంటల నుండి కలెక్టర్ గ్రామంలోని కాలనీలోని ఇంటి ఇంటికి వెళ్లి గ్రామస్థులతో మాట్లాడుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ తిరగడం జరిగింది.

గ్రామంలో క్షేత్రస్థాయిలో తిరిగితేనే  వారి సమస్యలు తెలుస్తాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం జరుగుతుందని, జిల్లా అధికారులందరూ రావడం జరిగిందన్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడం లేదని గ్రామస్తులు తెలుపగా,ఆర్టీసీ డిఎం కి ఫోన్ చేసి   మాట్లాడటంతో గ్రామానికి బస్సు పంపించారు.  ఈ రోజు నుండి గ్రామానికి  రెండు సార్లు బస్సు సర్వీసు వస్తుందని చెప్పారు. 

గ్రామంలో  ప్రధాన దారి పై డ్రైనేజీ సౌకర్యం సరిగా లేకపోవడంతో వర్షం కురిసినప్పుడు వరద ఇంట్లోకి వస్తుంది అని గ్రామస్తులు తెలుపడంతో వెంటనే డ్రైనేజీ పనులు చేపట్టాలని ,సిసి రోడ్లు లేని కాలనీలో సిసి రోడ్డు పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.  వైకుంఠధామకు బాట లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి రాగా పరిష్కరించడం జరుగుతుందని ఉన్నారు.  అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు.

ఇటీవల తాటి చెట్టు పై నుండి జారి పడి మరణించిన గోడిసెల శ్రీ రాములు గౌడ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎక్సైజ్ అధికారికి చెప్పడం జరిగింది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా గౌడ కులస్తులకు కాటమయ్య కిట్లను ఇచ్చేలా  చూస్తానన్నారు. ప్రైమరీ స్కూల్ ను సందర్శించి, విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ లో పాల్గొన్నారు.

విద్యార్థులు ప్రతిజ్ఞ సమయంలో విద్యార్థులు గుణింతాలు చదవడం,ఇంగ్లీష్ లో పొడుపుకథలు తప్పుల్లేకుండా చెప్పడం చూసి స్కూల్ ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయులను సన్మానించారు.  గ్రామపంచాయతీ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా  కలెక్టర్ మొక్కలు  నాటారు.గ్రామంలో చెరువు కట్ట వద్ద ఈత చెట్టు మొక్కలు  నాటడం జరిగింది. 

గ్రామంలోని పీర్ల కొట్టం వెనుక రోడ్డుకు మధ్యలో ప్రమాదా కరంగా ఉన్న కరెంటు స్తంభాన్ని తొలగించి, వాటి స్థానంలో సిమెంటు స్తంభాన్ని ఏర్పాటు చేయాలని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.