calender_icon.png 31 January, 2026 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

31-01-2026 08:02:36 PM

పదవ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు సెలవులు పెట్టొద్దు

టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్,(విజయక్రాంతి): శనివారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో ఎంఈఓ లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులులతో పదవ తరగతిలో శత శాతం ఉత్తీర్ణతపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత రావాలని, ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ఉండాలని, ఫెయిల్ కాకుండా ఉండాలంటే పదవ తరగతిలో ప్రతి విద్యార్థి గైర్హాజర్ లేకుండా చూడాలని, ఎల్లుండి సోమవారం నుంచి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాలల్లో తప్పనిసరిగా హాజరు ఉండాలన్నారు.

గైర్హాజర్ అయిన విద్యార్థుల ఇంటికి వెళ్లి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు తీసుకురావాల్సిన బాధ్యత ఉందన్నారు. సోమవారం నుండి పదవ తరగతి విద్యార్థుల హాజరు వంద శాతం ఉండాలని, సోమవారం నుండి పదవ తరగతి విద్యార్థుల హాజరు తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు.  ఉదయం 8:15 నుంచి సాయంత్రం 5:15 వరకు ప్రత్యేక తరగతులు తప్పకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం సాయంత్రం స్నాక్స్ అందించాలన్నారు. 

ఉపాధ్యాయులు పదవ తరగతి ప్రతి విద్యార్థి యొక్క ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను సొంత చేతిరాతతో తయారు చేసుకొని ఉండాలని సూచించారు. ఏదైనా కారణాల చేత గైర్హాజరైన విద్యార్థులు కూడా తప్పనిసరిగా పాస్ కావాలని ఆదేశించారు. పదవ తరగతికి బోధించే ఉపాధ్యాయులు సెలవులు పెట్టొద్దన్నారు. పదవ తరగతి విద్యార్థులను ఉపాధ్యాయులు స్పోర్ట్స్ కు, సంస్కృతిక కార్యక్రమాలకు, ర్యాలీలకు దూరంగా ఉంచాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో, కేజీవిబిలలో అత్యంత పేద విద్యార్థులు చదువుతున్నారని, వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే చదివే మార్గమని, ఆ చదువు అందించేది ఉపాధ్యాయులేనని అన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ముఖ్యమైన చాప్టర్లు, ముఖ్యమైన ప్రశ్నల సమాధానాలు నేర్పించి వారిని పాసయ్యేలా చూడాలని ఎంఈఓ లను, ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాధికారిని విజయ, ఏ ఎం ఓ సుదర్శన మూర్తి, తదితరులు పాల్గొన్నారు.