calender_icon.png 30 October, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల వల్ల కలిగిన నష్టంపై సమీక్షించిన కలెక్టర్

30-10-2025 04:38:42 PM

కరీంనగర్ (విజయక్రాంతి): వర్షాల వల్ల కలిగిన పంట, ఆస్తి నష్టం, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వర్షాల కారణంగా 8 పశువులు మరణించాయని, వీటి యజమానులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. వర్షం కారణంగా పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లు ఏమైనా ఉంటే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వెంటనే పరిహారం అందజేయాలని అన్నారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా సుమారు 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లుగా సమాచారం ఉందని, రైతు వారీగా తడిసిన ధాన్యం వివరాలను సేకరించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు. 

ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పూర్తిస్థాయిలో టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ తడవకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షం తగ్గుముఖం పట్టిన  వెంటనే పత్తి కొనుగోలు తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాల పట్ల రెవెన్యూ, పోలీస్, పంచాయతీ కార్యదర్శులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో నీరు పారుతున్న కల్వర్ట్లపై నుండి వాహనాలు, మనుషులు వెళ్లకుండా చూడాలని తెలిపారు. చెరువులు, కుంటల నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తం కావాలని తెలిపారు. నగరంలో నీరు నిలిచిన చోట దోమలు వృద్ధి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా  ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.