calender_icon.png 24 October, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై కలెక్టర్ సమీక్ష

23-10-2025 10:40:43 PM

కలెక్టర్ ను అభినందించిన ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి..

నిజామాబాద్ (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసిల్దార్లు, ఏ.పీ.ఎంలు, ఏ.ఓలు, ఏ.ఈ.ఓలు, ఐ.కె.పి కేంద్రాల ఇంచార్జ్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మోస్రా తహసిల్దార్ కార్యాలయం నుండి వీ.సీలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ళ కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేసిన విస్తృత ఏర్పాట్ల గురించి సంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్ ను అభినందించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ సెగ్మెంట్ పరిధిలోని వర్ని, రుద్రూర్, చందూర్, మోస్రా, కోటగిరి మండలాల పరిధిలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు సజావుగా కొనసాగుతున్నాయని అన్నారు. అయితే రుద్రూర్ మండలంలో కొన్ని కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులతో అనుసంధానం చేయలేదని ప్రస్తావించగా, గురువారం రోజున టాగింగ్ చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా జరిగేలా తహసిల్దార్లు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తహసిల్దార్లదే బాధ్యత అని స్పష్టం చేశారు. సంబంధిత శాఖలతో పరస్పర సమన్వయాన్ని పెంపొందించుకుని ధాన్యం విక్రయం విషయంలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు వీలుగా అనువైన ఖాళీ స్థలాలను గుర్తించి రైతులకు తెలియజేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతుల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని అన్నారు. మిల్లులకు ధాన్యం తరలించిన మీదట, వెంటదివెంట ట్రక్ షీట్లు తెప్పించుకుని ఓ.పీ.ఎం.ఎస్ లో వివరాలు నమోదు చేయించాలని అన్నారు. తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరుగుతుందన్నారు. వచ్చే రెండు రోజులలో జిల్లా వ్యాప్తంగా అన్ని నిర్దేశిత ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరువాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీ.ఆర్.డీ.ఓ సాయాగౌడ్, డీ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, మార్కెటింగ్ ఏ.డీ గంగుబాయి, డీ.సీ.ఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు తదితరులు పాల్గొన్నారు.