calender_icon.png 21 December, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేజీల పోరుబాట?

21-12-2025 12:58:40 AM

  1. సిద్ధమవుతున్న యాజమాన్యాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాం డ్‌చేస్తూ ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల కాలేజీలు జనవరిలో మరోసారి పోరుకు సన్నద్ధమవుతున్నాయి. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు ఇస్తామని హామీ ఇచ్చి తా త్సారం చేస్తున్నదని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

దీపావళికి ఇస్తానన్న రూ. 600 కోట్లలో దాదాపు రూ. 161 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి పోరుబాట కు 2,500 కాలేజీలు సిద్ధమవుతున్నాయి. అయితే దీనిపై ఆ యా కాలేజీల యాజమాన్యాల నేతలు త్వరలోనే ఓ సమావేశం పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ఉండడంతో ఇంత వరకూ వేచి ఉన్నామని, ఇక కార్యాచర ణను త్వరలోనే నిర్ణయిస్తామని యూనియన్ నేతలు తెలిపారు.

రూ. 440 కోట్లు పెండింగ్..

మొత్తం కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు దాదాపు రూ. 10 వేల కోట్ల వరకు ఉన్నాయి. అయితే వీటిలో 2023 విద్యా సంవత్సరానికి సంబంధించిన రూ. 2,500 కోట్లలో రూ. 1200 కోట్లకు గానూ ప్రభుత్వం కాలేజీల యాజమాన్యాలకు గతంలోనే టోకెన్లు జారీచేశారు. ఇవి ఎంతకీ విడుదల చేయకపోవడంతో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తొలుత సెప్టెంబర్ 15 నుంచి కాలేజీలు బంద్‌ను పాటించాయి.

ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో రెండు రోజుల పాటు అప్పట్లో కాలేజీలు తెరచుకోలేదు. అనంతరం ప్రభుత్వం చర్చలు జరిపి విడతల వారీగా ఫీజులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కాలేజీలు అప్పుడు బంద్‌ను విరమించాయి. సెప్టెంబరులో రూ. 600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని, మిగిలిన మరో రూ. 600 కోట్లను దీపావళికి విడుదల చేస్తామని ప్రభుత్వం అప్పట్లోనే హామీ ఇచ్చింది.

అయితే ఇందులో రూ. 376 కోట్లను మాత్రమే అప్పట్లో విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీప్రకారం మిగిలిన పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3 నుంచి మళ్లీ కాలేజీల బంద్‌ను పాటించాయి. దిగొచ్చిన ప్రభుత్వం కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపి మరోసారి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. కాలేజీలకు రావాల్సిన మొత్తం టోకెన్ అమౌంట్ రూ. 1200 కోట్లలో ఇప్పటివరకు ప్రభుత్వం రెండు దఫాలుగా రూ. 600 కోట్ల వరకు చెల్లించింది.

దీపావళికి ఇస్తామన్న రూ. 600 కోట్లలో ఇప్పటి వరకు కేవలం రూ. 161 కోట్లను మాత్రమే చెల్లించింది. ఇంకా దాదాపు రూ. 440 కోట్లను చెల్లించలేదని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రభు త్వం హామీ ఇచ్చి బకాయిలు చెల్లించకపోవడంతో మరోసారి కాలేజీలు పోరుబాటకు సిద్ధమవుతున్నట్లు  ఉన్నత విద్యా కళాశాలల సమాఖ్య (ఫతి) యూనియన్ నేత ఒకరు ‘విజయక్రాంతి’కి తెలిపారు. 

ఆర్థిక శాఖలో వింత పరిస్థితి..

నవంబర్‌లో కాలేజీల యాజమాన్యాలతో చర్చల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే కాలేజీల యాజమాన్యాలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి మిగిలిన బకాయిలను విడుదల చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

అయితే కాలేజీలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆయన జారీచేసిన ఆదేశాలను అధికారులు పాటించడంలేదని కాలేజీల యాజమా న్యాలు పేర్కొంటున్నాయి. ‘డిప్యూటీ సీఎం బకాయిలు విడుదల చేయాలంటారు.. కానీ, అధికారు లు మాత్రం తమ బిల్లులు చేయడంలేదు. ప్రతిసారి తమ బిల్లు ఆర్థిక శాఖకు వెళ్లి వెనక్కి తిరిగి వస్తోంద’ని ఓ యూనియన్ నేత వాపోయారు. 

8 వేల కోట్లు విడుదల చేయాలి 

పెండింగ్‌లో ఉన్న ఎనిమిది వేల నుంచి పది వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఫీజు బకాయి లు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు కొన్ని కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. దీంతో విద్యార్థులు పై చదువులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేయాలి. పేద విద్యార్థుల ఉసురుపోసుకోవద్దు.

 జిల్లపెళ్లి అంజి, బీసీ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు